KTR: రాష్ట్రంలోని ప్రజలందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలాగానే చూసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ను ఏ విధంగా విమర్శించలేకనే కుటుంబపాలన అంటున్నారని మండిపడ్డారు. విపక్షాలకు విమర్శించడం తప్ప మరో ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్షాలు చెప్పినట్టు మాది కుటుంబపాలనే అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. కాకపోతే ప్రజలే మా కుటుంబం….కాబట్టి అందుకే మాది కుటుంబపాలన అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి కుటుబంలో కేసీఆర్ కూడా భాగస్వామే అని మంత్రి వెల్లడించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ అమలు చేసి అందరికీ అండగా నిల్చున్నారని పునరుద్ఘాటించారు. ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులకు కుమారుడిలా ఆదుకున్నారని ప్రస్తావించారు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల కోసం క్యూ కడుతున్నారని వెల్లడించారు.
పుట్టినబిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అందరికీ సాయంగా ఉన్నారని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తయారు చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
పల్లెప్రగతి ద్వారా రాష్ట్రంలో పల్లెలన్నీ బాగుపడుతున్నాయని మంత్రి వెల్లడించారు. దేశంలో అత్యుత్తమ గ్రామాలు, మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రమే చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం మాటలు చెప్పడం తప్పా ఒక్క పని చేయదని దుయ్యబట్టారు.