స్వాతంత్య్ర వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలానే మన రాష్ట్రంలో కూడా స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దమైంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మంగళవారం నాడు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతీయ జెండాను ఎగరువేసిన అనంతరం సీఎం జగన్ సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్దం చేశారు.
ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటల వరకు సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. అదే విధంగా ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు అవుతారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి. వీవీఐపీలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎన్‌సీసీ, ఏపీఎస్పీ, బెటాలియన్లు, ట్రైబల్ వెల్ఫేర్ కంటెంజెంట్స్ కవాతు చేయనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ రూపొందించిన శకటాలు ప్రదర్శన ఉంటుంది. కాగా జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్క రూ ఫ్లాగ్ కోడ్ 2002ను అనుసరించాల్సి ఉంది. అలాగే యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్–1971 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ కోడ్‌లోని నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండాపై పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండాను ఎగురవేయవచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అయితే జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది.