తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మూడు అతిగొప్ప సంఘటనలు కేవలం నెలరోజుల వ్యవధిలో జరగబోతున్నాయి. ఈ మూడు సంఘటనలు కేసీయార్ పేరును, ప్రతిష్టను, యశస్సును చిరస్థాయిగా నిలపబోతున్నాయి. కేసీయార్ అధికారం చేపట్టిన మొదటి టర్మ్ లోనే ఈ సంఘటనలు జరగడం, మూడింటికి కేసీయారే కేంద్రబిందువు కావడం మరింత విశేషం.
మొదటిది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మెట్రో రైల్ ప్రారంభోత్సవం. భాగ్యనగరానికి మకుటాయమానమైన, తెలుగురాష్ట్రాలలో మొదటిసారిగా ముప్ఫయి అడుగుల ఎత్తున హైదరాబాద్ వాసులు విహరించే అదృష్టాన్ని దక్కించుకోబోతున్నారు. ఎన్నాళ్ళనుంచో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ అద్భుతాన్ని కేసీయార్ నిరంతర కృషితో సాకారం చెయ్యబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాలంలో రూపుదిద్దుకున్న ఈ ఆలోచన రోశయ్య గారి కాలంలోనే మొదలైనా, కేసీయార్ కాలంలో పూర్తి కావడం, రాష్ట్రం విడిపోయాక ప్రారంభం కావడం తో ఈ కీర్తి కేసీయార్ కిరీటంలోనే చేరబోతున్నది.
ఇక అదేరోజు ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరగడం. వివిధ దేశాలనుంచి సుమారు పదిహేనువందలమంది ప్రతినిధులు, మూడు వందల యాభై మంది పారిశ్రామికవేత్తలు (వీరంతా విశాఖ సదస్సు బాపతు కాదండోయ్… నిజమైన పారిశ్రామికవేత్తలే) పాల్గొనడం, అందునా, అగ్రరాజ్యం అధినేత కుమార్తె దీనికి సారధ్యం వహిస్తుండటంతో దీనికి ఒక కళ, విలువ వచ్చాయి. ఇందులో వీరు ఏమి తీర్మానాలు చేస్తారో, ఏమి అమలుచేస్తారు అనేది తెలియదు కానీ, దీనివలన రాబోయే కాలంలో అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయని విశ్వసించవచ్చు. కేసీయార్ ప్రభుత్వ కాలంలో జరగడం కారణాన కేసీయార్ యశస్సు పెరుగుతుందని భావించవచ్చు.
ఇక మూడోది ప్రపంచ తెలుగుమహాసభల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుతల్లిని, తెలుగుభాషను నిలువులోతు గోతిలో పాతిపెడుతున్న సమయంలో, కేసీయార్ ఈ ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తూ తెలుగుభాషకు ప్రాణం పోస్తున్నారు. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తిరుపతిలో నిర్వహించినా, దానికి పెద్ద గుర్తింపు రాలేదు. ఎవరూ పట్టించుకోలేదు. కానీ, కేసీయార్ ప్రభుత్వం నిర్వహించబోతున్న సభలకు ఎక్కడాలేని గ్లామర్ వచ్చింది. మొన్ననే, నలభై మంది సాహిత్యవేత్తలతో కేసీయార్ సమావేశమై ఈ మహాసభలను గూర్చి చర్చించారు. దీన్ని బట్టే కేసీయార్ చిత్తశుద్ధి ఎంత విశాలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
పై మూడు ఘట్టాలు కేసీయార్ వ్యక్తిగత ప్రతిష్టను కూడా పెంచబోతున్నాయి. ఊరికే స్వకుచమర్ధనమ్ చేసుకోకుండా, సైలెంట్ గా ప్రతిష్టాత్మకమైన కార్యాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారికి అభినందనలు.