దేశంలో పన్ను ఎగవేతదారులకు ముకుతాడు వేయడంతో పాటు కొత్తగా మరో వర్గం ప్రజలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చి ఆదాయం పన్ను వసూళ్లను పెంచుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభు త్వం తహతహలాడుతోంది. సంపన్న రైతులపై పన్నులు విధించడం ద్వారా దండిగా ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని యోచిస్తున్నది. ప్రస్తుతం దేశంలోని 70 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న కమతాలను (ఒక హెక్టారులోపు విస్తీర్ణమున్న పంట భూములను) కలిగి ఉండగా, కేవలం 0.4 శాతం వ్యవసాయ కుటుంబాల వద్ద మాత్రమే పెద్ద కమతాలు (పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న పంట భూములు), 3.7 శాతం వ్యవసాయ కుటుంబాల వద్ద 4 నుంచి 10 హెక్టార్లలోపు విస్తీర్ణమున్న పంట భూములు ఉన్నాయని నేషనల్ శాంపిల్ సర్వే స్పష్టం చేస్తున్నది. వీరిలో చివరి రెండు కేటగిరీల్లోని 4.1 శాతం మంది ధనిక రైతులపై సగటున 30 శాతం వ్యవసాయ పన్ను విధించినా ప్రభుత్వానికి కనీసం రూ.25 వేల కోట్ల రాబడి వస్తుందని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ట్యాక్స్ టీమ్ లీడర్ రజుల్ అవస్థి చెబుతున్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా ఇదే సూచన చేశారు. సంపన్న రైతులపై పన్నులు విధించాలని ఆయన గతేడాదే కేంద్రానికి స్పష్టం చేశారు. ఆదాయం ఏ రంగంలో వస్తున్నదన్న విషయంతో నిమిత్తం లేకుండా ధనిక రైతుల గురించి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నీతి ఆయోగ్ కూడా కేంద్రానికి ఇదే ప్రతిపాదన చేసింది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. తదుపరి మూడు సంవత్సరాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి గతేడాది ప్రకటించిన కార్యాచరణ ముసాయిదాలో నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన చేసింది. రైతులకు మూడేళ్ల పాటు వచ్చే సగటు ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకుని వ్యవసాయ ఆదాయంపై విధించాల్సిన పన్నును మదింపు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది.