బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మరోమారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకపడ్డారు. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాసం పేరుతో టీడీపీ నేతలు హడావుడి చేస్తున్న నేపథ్యంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అంటే “టోటల్ డ్రామా పార్టీ’ అంటూ జీవీఎల్ కొత్త అర్థం చెప్పారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం గెలవడం కల్ల జోస్యం చెప్పిన జీవీఎల్… ఆ పార్టీకి క్రెడిబిలిటీ లేదు… రాష్ట్రంలో ప్రజలే ఛీ కొడుతున్నారన్నారు.
చంద్రబాబు పాపాల చిట్టా తమదగ్గర ఉందిన, పార్లమెంట్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు చిత్రగుప్త చిట్టాని బహిర్గతం చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారు… వీరి దొంగ దీక్షలను ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఎలా మభ్యపెట్టారో, వంచించారో అన్ని వాస్తవాలను పార్లమెంట్ వేదికగా తెలియజేస్తామన్న జీవీఎల్… తెలుగుదేశం కొత్త డ్రామాలు ఆడుతోంది… ఎదో పొడిచేస్తాం అంటున్నారు, విర్రవీగుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులను తీసుకుంటూ టీడీపీ డ్రామాలాడుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.“స్పెషల్ ప్యాకేజీని తీసుకుంటూ… మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు… రెండేళ్ల క్రితం ప్యాకేజీ… అద్భుతం అన్నారు. ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారు“ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నుకున్న పాపానికి 1500 రోజులుగా ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు సెటైర్లు వేశారు.“కేంద్రం పథకాలకు పచ్చ బ్రాండ్ వేస్తున్నారు… పోలవరానికి వారం వారం వెళ్లి ఏమి సాధిస్తున్నారు? పోలవరానికి మీరు ఏమి చేశారు? కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ డ్రామాలే ఆడుతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ రాకుండా చేసింది టీడీపీ అని… ఇప్పుడు మళ్లీ దీక్షలు అంటున్నారు“ అని మండిపడ్డారు.