తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరగాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 35ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోకి చొరబడి అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపడమనేది దారుణమైన విషయమని, ఇందులో నిజాలు తేలాలని ఆయన కోరారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గొడ్డలితో తలపై ఐదుసార్లు దాడిచేయడంతో వివేకా అక్కడికక్కడే చనిపోయారని జగన్ అన్నారు. ఈ విషయాన్ని పోలీసులే చెబుతున్నారని అన్నారు. ఐతే… వివేకా రాసినట్టుగా ఉన్న ఓ లెటర్ ను పోలీసులు తనకు చూపించారని.. అన్నారు. లెటర్ లో ఓ డ్రైవర్ పేరు ఉందని.. ఇది పక్కాగా కేసును పక్కదారి పట్టించడమే అని అన్నారు. బెడ్ రూమ్ లో దుండగులు వైఎస్ వివేకాను నరికి చంపిన తర్వాత… బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి… ప్రమాదవశాత్తూ చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేశారని అన్నారు వైఎస్ జగన్. బాత్రూమ్ లో మరకలను అంటించి.. మూర్చవచ్చి కిందపడి కొట్టుకున్నట్టుగా కమోడ్ కు రక్తాన్ని అంటించి ఓ డెత్ సీన్ ను సృష్టించారని అన్నారు. రాజకీయంగా అత్యంత నీచమైన చర్య ఇది అని జగన్ పేర్కొన్నారు.
