శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్ ముందుగా నివాళి అర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు… “వివేకానందరెడ్డి అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదు. దర్యాప్తు తీరు బాధాకరం. వివేకానందరెడ్డి చనిపోతూ ఒక లెటర్ రాశారని.. అందులో డ్రైవర్ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యలో చాలా మంది ఉన్నారు. బెడ్రూంలో ఐదుసార్లు దాడి చేశారు. తలపైనే ఐదుసార్లు గొడ్డలితో నరికారు. రక్తం కక్కుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు యత్నించారు. చిన్నాన్న రాసినట్లుగా చూపిస్తున్న లెటర్ కూడా కల్పితమే. వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం లేదు. ఎస్పీతో నేను మాట్లాడుతున్నప్పుడే..ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ నుంచి ఎస్పీకి ఫోన్లు వస్తున్నాయి“ అని జగన్ ఆరోపించారు.పక్కాగా కేసును పక్కదోవ పట్టిస్తూ.. ఒక డ్రైవర్ పై నేరం నెట్టేందుకు ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. నిజాన్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని… అంత తీవ్రమైన గాయాలైన వ్యక్తి లెటర్ ఎలా రాస్తాడని ప్రశ్నించారు. దుండగుల సమక్షంలో లెటర్ రాస్తుంటే హంతకులు చూస్తుండిపోతారా..? ఇదెంత దారుణం అని జగన్ అన్నారు.
