తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో తాము ఎంతో అభివృద్ధి చేశామని, తమకే ప్జలు అండగా నిలుస్తారని డబ్బా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమదే అధికారమని కూడా ఆ పార్టీ ప్రకటించుకుంటోంది. అయితే, ఈ మాటలను సామాన్యుల సంగతి దేవుడెరుగు..సొంత పార్టీ నేతలే నమ్మడం లేదనే విషయంలో స్పష్టమైంది.
రాజధాని అమరావతికి చెందిన ముఖ్య నేత వైసీపీ గూటికి చేరారు. వైఎస్ఆర్సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గుంటూరు జడ్పీ ఛైర్మన్ జానీమూన్ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఆమెకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.జానీమూన్తో పాటు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు.
కాగా, జానీమూన్ ఫైర్‌బ్రాండ్ నేతగా ముద్ర పడిన సంగతి తెలిసిందే. మంత్రి రావెల కిశోర్ వల్ల తనకు,తన భర్తకు ప్రాణహాని ఉందని జానీమూన్ ఆరోపించారు. మంత్రి రావెల అనుచరగణం రంజాన్ సమయంలో తమ ఇంటికి కత్తులతో వచ్చి పలు మార్లు బెదిరించారని జానీమూన్ వాపోయింది. జిల్లాలో మరియు తన మండలంలో తాను ఏ పని చేసినా దానిని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కలిసి తనకు అదనపు రక్షణ కావాలని కోరినట్లు జానీమూన్ తెలిపారు.