ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏదీ ఒక పట్టాన జనాలకు ఎక్కట్లేదు. ఏదైనా కొత్త సినిమా పోస్టర్ వస్తే చాలు.. వెంటనే ఇది ఒరిజనల్ పోస్టరా..? లేదంటే ఎక్కడన్నా ఎత్తేసినా ఐడియానా..? అంటూ నెటిజన్లు విపరీతంగా రీసెర్చ్ చేసేసి.. బీభత్సంగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ”సాహో” ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా ఈ బెడద తప్పట్లేదు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాహో సినిమా తాలూకు పోస్టర్ ఒకటి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లోముఖానికి ఒక క్లాత్ చుట్టుకుని ఒక పెద్ద సిటీ బ్యాక్ డ్రాప్లో నడుచుకుంటూ వస్తాడు ప్రభాస్. అయితే, ఈ పోస్టర్ అచ్చం ఒక హాలీవుడ్ సినిమాలోని స్టిల్ వలె ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నిజంగానే చూస్తుంటే.. బ్లేడ్ రన్నర్ గేమ్, బ్లేడ్ రన్నర్ 2049 సినిమా పోస్టర్లు కలిపి ప్రభాస్ సాహో పోస్టర్‌ను తయారు చేసినట్లే ఉంది. ఎవరైనా కూడా ఈ పోస్టర్లను చూస్తే మాత్రం అసలు ప్రభాస్ ఒరిజినల్ కాన్సెప్ట్‌తో రాకుండా ఈ కాపీ కాన్సెప్ట్‌లు ఏంటని ఎవరైనా అడక్కుండా ఉండలేరు. ఒకపక్కన బాహుబలి తరువాత హాలీవుడ్ స్థాయి సినిమా చేస్తున్నాడని అనుకుంటే ఇలా కాపీ లొల్లితో అప్పుడే సాహోపై కామెడీ మొదలైపోయింది. చివరకు రొటీన్ మసాలా సినిమాతో వస్తే మాత్రం… అభిమానులు బాగా హర్ట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.