తెలుగు సినిమాల్లో అంతో ఇంతో సత్తా చాటిన హీరోయిన్లలో లయ ఒకరు. ఈ విజయవాడ అమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా పరిచయం అయి.. మీడియం రేంజి హీరోయిన్గా ఎదిగింది. ఏడెనిమిదేళ్ల పాటు మంచి జోరే చూపించింది. ఐతే కెరీర్ జోరు తగ్గుతున్న సమయంలోనే ఓ ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయిందామె. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయిన లయ.. గత ఏడాది మాత్రం ఓ పెద్ద సినిమాలో అప్రాధాన్య పాత్రలో కనిపించింది.
శ్రీను వైట్ల-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పూర్తిగా అమెరికాలో చిత్రీకరణ జరుపుకోగా.. అందులో లయ కూతురు ఓ కీలక పాత్రలో నటించింది. ఆమెకు సపోర్టుగా ఈ సినిమా సెట్లో ఉంటూ.. సినిమాలో అసలేమాత్రం ప్రాధాన్యం లేని చిన్న పాత్రలో కనిపించింది లయ. ఇలా కనిపించిందంటే రీఎంట్రీకి ఆమె రెడీగా ఉన్నట్లే. నిజానికి ‘అరవింద సమేత’ లాంటి పెద్ద సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేసే అవకాశం లయకు వచ్చిందట. ఇందులో జగపతిబాబుకు జోడీగా నటించే అవకాశం లయకే ముందు దక్కిందట. కానీ నవీన్ చంద్రకు తల్లిగా.. నడి వయసు పాత్ర చేయడానికి లయ సందేహించిందట.
లయ స్థానంలో ఈ పాత్ర చేసిన ఈశ్వరీరావుకు మంచి పేరే వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అక్క, వదిన, తల్లి పాత్రలు చేయడం తనకిష్టం లేదని.. అందులోనూ ‘అరవింద సమేత’లో తనకు ఆఫర్ చేసింది మరీ పెద్ద పాత్ర అని.. దీంతో సున్నితంగా తిరస్కరించానని.. తనకు మళ్లీ సినిమాల్లో నటించాలనుందని.. భవిష్యత్తులో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లతో కచ్చితంగా సినిమాలు చేస్తానని లయ తెలిపింది. ఐతే పెళ్లి తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నాక అక్క, వదిన, తల్లి పాత్రలే వస్తాయన్న సంగతి లయకు తెలియందేమీ కాదేమో.