వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ మాత్రం ప్రజల సమస్యలను వింటూ.. వారిలో భరోసా నింపుతూ ముందుకు కదులుతున్నారు. అయితే, జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ఇప్పటికే తొమ్మది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మేలా 600 అబద్ధపు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, అలాగే, కాపుల రిజర్వేషన్, నిరుద్యోగ భృతి ఇలా అన్ని వర్గాలను మభ్యపెడుతూ సీఎం చంద్రబాబు హామీలు ఇచ్చిన విషయం విధితమే. ఆ హామీలే సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే, ఇప్పుడు ఆ హామీలే సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకు కారణం కాబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు నమ్మబలికేలా ఇచ్చిన హామీలను.. అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజలు కూడా చంద్రబాబుకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకుల సమచారం.
చంద్రబాబుకు తమ ఓటు ద్వారా బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్న వారిలో కాపు నేతలు ముందు వరుసలో ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లు కల్పిస్తామంటూ హామీ ఇచ్చి.. సీఎం కుర్చీ ఎక్కాక మీరెవరో తనకు తెలియదన్నట్టు చంద్రబాబు వ్యవహరించడాన్ని కాపు నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే నాడు చంద్రబాబుకు వత్తాసు పలికిన నేతలంతా ఇప్పుడు జగన్ చెంతకు చేరుతున్నారు. అందులో భాగంగానే, కాపు నేత అయిన ఒంటెద్దు వెంకయ్య నాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, కాపులు అధికశాతం ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌కు వస్తున్న ఆదరణను చూస్తుంటే .. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ వర్గం ఓట్లన్నీ జగన్‌కే పడుతాయని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఒంటెద్దు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.