తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు నియామకాలు చేపట్టబోతోంది . మొదటగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, పరిపాలన విభాగం సిబ్బంది వంటి 8003 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీటిని భర్తీ చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. తర్వాత ఈ 8003 పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనల ఫైలు సీఎం కేసీఆర్ దగ్గరకు చేరింది. భర్తీ సాధ్యాసాధ్యాలపై సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.ప్రస్తుతం వైద్య విధాన పరిషత్ కింద 1086 డాక్టర్ పోస్టులుండగా.. వీటికి అదనంగా 4795 పోస్టులు, నర్సులు ప్రస్తుతం 2104 మంది ఉండగా.. అదనంగా 2003 పోస్టులు, అలాగే పారా మెడికల్ సిబ్బంది పోస్టులు 644 ఉండగా.. అదనంగా 816 పోస్టులు భర్తీ చేయాలని, అడ్మినిస్ట్రేటివ్ విభాగం కింద 236 పోస్టులుండగా.. అదనంగా 389 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ముందుగా 8003 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది.
వైద్య విధాన పరిషత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 112 ఆస్పత్రులకుగాను 10 వేల పడకలు ఉన్నాయి. ప్రసుత్తం కేసీఆర్ కిట్లతోపాటు అదనపు రోగులు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల వల్ల ప్రతి చోటా ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ఏడాది కేవలం కేసీఆర్ కిట్ల వల్ల సర్కారీ దవాఖానాల్లో మూడు లక్షల ప్రసవాలు అవుతాయని అంచనా. దీనికితోడు ఐసీయూలు, ఎస్‌ఎన్‌సీయూలు, ట్రామా కేర్ కేంద్రాలు, డయాలసిస్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే అదనపు సిబ్బంది అవసరమవుతుంది. అందుకే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాలనుకుంటోంది. అదనపు సిబ్బందిని మొదట తాత్కాలికంగా, ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన నియమించబోతున్నారు. సీఎం కేసీఆర్ ఆమోదముద్ర పడిన వెంటనే ఇది ఆర్థిక శాఖకు వెళుతుంది. అక్కడ ఆమోదం పొందగానే అధికారికంగా ఉత్తర్వ్యులు వెలువడనున్నాయి. జీవో వెలువడిన తరువాత 45 నుంచి 60 రోజుల్లోగా వీటిని భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.