తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్దిరోజులుగా పలు విషయాలపై అర్ధవంతంగా చర్చ జరుగుతుంది తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అనవసర ఆరోపణలు చేశారు .దీనికి సమాధానంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాలనుకుంటే.. మీ కోటాలో 14వ తేదీ రోజు అదే అంశంపై నోటీసు ఇవ్వండి.. దానిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. కొత్త సంప్రదాయాలకు తెరతీయవద్దని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిరసనల పేరిట సభా సంప్రదాయాలను తుంగలో తొక్కొద్దన్నారు.
2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు కేజీల బియ్యం ఇస్తామని చెప్పింది. కానీ అధికారంలో ఐదేండ్లు ఉండి.. ఆరు కిలోల బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా.. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా సరే.. తమ ప్రభుత్వం మాత్రం ప్రతి నెల ప్రతీ మనిషికి ఆరు కేజీల బియ్యం ఇచ్చి తీరుతుందని మంత్రి ఉద్ఘాటించారు. రేషన్ షాపులు యధావిధిగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.