ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టిన మాట వాస్తవం అన్నారు. కానీ తమ ప్రభుత్వంలో అలా జరిగిందనడం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,651 కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు. భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలోనే అమలవుతుందన్నారు . దళిత, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రెండు రోజులు కచ్చితంగా చర్చ చేపడుదామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు రూ. 88 వేల 71 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 33 వేల 462 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ప్రగతి పద్దు కింద ఎస్సీల అభివృద్ధికి అధికంగానే ఖర్చు చేశామన్నారు.
