నిండైన తెలుగుదనం ఉట్టిపడే సినిమా వచ్చి చాలా ఏళ్లైపోయింది. కుటుంబమంతా కలిసి కూర్చుని చూస్తూ హాయిగా నవ్వుకుంటూ, మనదైన తెలుగు సంస్కృతిని చూస్తూ ఆనందించే సినిమా రావాలని కోరుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ సమాధానంగా వచ్చింది శతమానంభవతి సినిమా. సినిమాల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపిస్తున్న శర్వానంద్, దర్శకుడు సతీష్ వేగెశ్న కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సూపర్ హిట్ గా నిలిచి, అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది.
శతమానంభవతి అన్న టైటిల్ తోనే నిర్మాత దిల్ రాజు సగం సక్సెస్ ను కొట్టేశాడు. సినిమా ఎలా ఉండబోతోందో టైటిల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా టైటిల్ చూసి హాల్ కు వెళ్లిన ప్రేక్షకుడు, ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వడు. సినిమాలో ఏది ఉంటుందని భావించి ఆడియన్స్ థియేటర్ కు వెళ్లారో, అదే వారికి కనిపించింది. దీంతో పూర్తిగా తృప్తి చెందిన ప్రేక్షకులు, ఘనవిజయాన్ని మూవీ టీంకు బహుమతిగా ఇచ్చారు.
పల్లెటూర్లో ఉండే ఒక సాదాసీదా కుర్రాడు, అతని తాత,నానమ్మలతో కలిసి జీవిస్తుంటాడు. ఇక అతని తాతయ్య పిల్లలందరూ విదేశాల్లో సెటిలై ఉంటారు. ఇదే బేసిక్ స్టోరీ లైన్. నేడు చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితిని తీసుకుని, దానికి ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామాను జతకలిపి తెరకెక్కించాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. చాలామంది తమను తాము ఈ సినిమాతో రిలేట్ చేసుకుని చూసుకున్నారు. ఇక శర్వానంద్ లాంటి యువహీరో సైతం ఇలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ప్రకాష్ రాజ్, జయసుధ ల నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మిక్కీ జే మేయర్ మనసుకు ఇంపైన సంగీతాన్ని సమకూర్చాడు.
అచ్చమైన పల్లెటూరి సినిమా చూసి చాలా కాలమైన తెలుగు ప్రేక్షకులకు శతమానం భవతి అద్భుతంగా నచ్చేసింది. ఎక్కడా అశ్లీలత లేకుండా, క్లీన్ సినిమాగా తెరకెక్కిన శతమానం భవతిని దీవించి 2017లో టాప్ 5 సినిమాల్లో చోటు కల్పించేశారు మన తెలుగు సినిమా అభిమానులు.