కేవలం ఒక్క సినిమాతో యావత్ టాలీవుడ్‌నే తనవైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. షాలినీపాండే, విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం అలా రిలీజైందో.. లేదో.. మొదటి రోజునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. విమర్శకులు వారి నోటికి పదునుపెట్టారు. అయినా ఆ వివాదాలనే, విమర్శలే అర్జున్‌రెడ్డికి మాంచి పబ్లిసిటీని తెచ్చిపెట్టాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్ర విజయంలో షాలినీపాండే పాత్ర ఎక్కువనే చెప్పుకోవాలి. బోల్డ్ సీన్లలో సైతం తన సహజ నటనతో నటించి.. సినీ జనాన్ని ఆకట్టుకుంది.
ఒక్క సినిమాలో నటించి యువకులను బుట్టలో వేసుకున్న ఈ భామ మధ్యప్రదేశ్ జబల్పూర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె. మూర్తీ భవించిన, ముగ్దమనోహరమైన అమాయకత్వంతో ఉండే ఈ భామ సినిమా ఎంట్రీ చాలా ఆసక్తికరంగా సాగింది. చిన్నప్పట్నుంచే సినిమాలపట్ల ఆసక్తి ఉన్న ఈ భామ ఏ హీరోయిన్ ఫేస్ చేయని ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు ఇష్టం లేకున్నా తండ్రి అభీష్టం మేరకు ఇంజినీరింగ్‌ను మమ అనిపించింది.
అయితే, ఒక రోజున సినిమాల్లో నటించాలన్న తన కోర్కెను తండ్రి ముందు ఉంచింది షాలినిపాండే. తండ్రి అందుకు ససేమిరా అనడంతో ఇంట్లో నుంచి పారిపోయి ముంబైలోని తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్లిపోయింది. ఇక అక్కడ్నుంచి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది షాలినిపాండే. ఒకానొక సమయంలో షాలినీ ఆచూకీ తెలిసిపోవడంతో మర్యాదగా ఇంటికి వస్తావా…? లేక పోలీసులను పంపమంటావా..? అంటూ తండ్రి అనడంతో అలాంటి పనులు చేస్తే నేనే మీపై కేసులు పెడుతానంటూ హెచ్చరించిందంట షాలినీపాండే. సినిమాలు వదిలి ఇంటికి రాకుంటే గనుక నాకు కూతురు లేదనుకుంటానంటూ.. సినిమా డైలాగ్‌లు చెప్పాడట షాలిని తండ్రి.
ఆ తరువాత తన ఫ్రెండ్స్ కూడా ఎవరి దారి వారు చూసుకున్నారని, ఇక గతిలేని పరిస్థితిలో ఇద్దరు కుర్రాళ్లతో కలిసి రూం షేర్ చేసుకోవాల్సి వచ్చిందని, ఆ కుర్రాళ్లు చాలా మంచి వారు కాబట్టే వారితో కలిసి ఒకే రూంలో రెండు నెలలపాటు ఉన్నానంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది షాలినీపాండే. చివరికి తన స్నేహితుల సాయంతోనే అర్జున్‌రెడ్డి చిత్రం కోసం ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్‌గా ఎంపిక అయింది. షూటింగ్ సమయంలోనూ తన వద్ద డబ్బులు ఉండేవి కావని, అర్జున్‌రెడ్డి చిత్రం తరువాత తనకు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది షాలినీపాండే.