పేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన రెడ్డి సేవా సమితి భవనాన్ని ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. కులాల ప్రాతిపదికన కాకుండా పేదల ఆధారంగా రిజర్వేషన్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.రెడ్డి కులస్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
షాద్‌నగర్ రెడ్డి సేవా సమితి అభివృద్ధికి రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులస్థులు రాజాబహుదూర్ వెంకట్రాంరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రెడ్డి సేవా సమితి అభివృద్ధికి తనవంతుగా రూ.5 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. అనంతరం రెడ్డి సేవా సమితి నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 359