Home / SLIDER / ఫ‌లించిన ప్ర‌భుత్వ ఒత్తిడి..హైద‌రాబాద్‌కు విమానంలో నోట్లు

ఫ‌లించిన ప్ర‌భుత్వ ఒత్తిడి..హైద‌రాబాద్‌కు విమానంలో నోట్లు

నోట్ల క‌ష్టాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన ఒత్తిడి ఫ‌లించింది. నోట్ల కొరత తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్‌కు విమనాల నుంచి నగదు తరలించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నిర్ణయించింది. నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ వివరించింది. ఈ కమిటీకి ఎస్‌బీఐ నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలో నోట్ల క‌ష్టాలు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎస్‌బీఐని వివ‌ర‌ణ కోరింది. ఈ సంద‌ర్భంగా న‌గ‌దు త‌ర‌లింపు అంశాన్ని వివ‌రించింది.

నోట్ల స‌మ‌స్య‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నందున త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఎస్‌బీఐని ఆదేశించింది. దీంతో నోట్ల కొరత సమస్యను అధిగమించేందుకు కోచి, చెన్నై, ముంబై, భువనేశ్వర్‌ల నుంచి విమానాల ద్వారా నగదు తరలించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. తెలంగాణలో 8500 ఏటీఎంలు ఉండగా దాదాపు సగం ఏటీఎంలు మూత పడిన విషయాన్ని అధికారులు అంగీకరించారు. విమానాల ద్వరా నోట్ల తరలింపు చేపట్టేందుకు ఆర్‌బీఐ అనుమతి కోరామని, గ్రీన్ సిగ్నల్‌ వచ్చిన వెంటనే పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు నోట్లను తరలిస్తామని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. రాబోయే ఒక‌ట్రెండు రోజుల్లో ఈ మేర‌కు న‌గదు రానుంద‌ని స‌మాచారం.