‘అన్నా ఆపదలో ఉన్నాం. సాయం చేయండి’ అని ఒక్క ట్వీట్ పెడితే చాలు ఎక్కడున్నా నిమిషాల్లో స్పందిస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆయన్ను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్‌మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే కేటీఆర్ తాజాగా అభిమానులతో ట్విటర్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలపై తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా ఉన్నారా?
కేటీఆర్: అవి ఎప్పుడు జరిగినా మేం సిద్ధంగానే ఉన్నాం.
2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీచేయాలని నాలాంటి చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమంటారు?
కేటీఆర్: భవిష్యత్తులో ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు.
2019 ఎన్నికల్లో జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా?
కేటీఆర్: సిరిసిల్ల ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారు. వారి నమ్మకానికి కట్టుబడి ఉంటాను.
ఈజ్ ఈఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
కేటీఆర్: అందుకు ఏపీకి శుభాకాంక్షలు. మేం 0.09 శాతంతో వెనుకబడ్డాం.
నేను లా చదువుతున్నాను. మీ ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నాను. దరఖాస్తు పత్రాలు కూడా పంపించాను. నన్ను తీసుకుంటారా?
కేటీఆర్: ఒక లా విద్యార్థి నా వద్ద ఏం ఇంటర్న్‌షిప్ చేస్తాడో నాకు తెలీదు. దరఖాస్తు పత్రాలను పరిశీలించమని నా బృందానికి చెప్తాను.
నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు కదా? మీకెలా అనిపిస్తోంది?
కేటీఆర్: నిజాం అద్భుతమైన కాలేజ్
భారత యువత గురించి ఒక్కమాటలో చెప్పండి సర్
కేటీఆర్: పవర్ ఆఫ్ యూత్
ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ధోనీనా, కోహ్లీనా?
కేటీఆర్: రాహుల్ ద్రావిడ్, సచిన్ తెందుల్కర్. నేను వారి తరం నుంచే వచ్చాను.
నగర బహిష్కరణలపై మీ అభిప్రాయం ఏంటి?
కేటీఆర్: లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.
ఒక రాజకీయ నేతగా మీరు సాధించిన గొప్ప విషయాల గురించి చెప్తారా?
కేటీఆర్: నేను రిటైర్ అయ్యాక చెప్తాను
ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్ గొప్పా? కేసీఆర్ గొప్పా?
కేటీఆర్: సమాధానం మీకు తెలుసు.
2019 ఎన్నికల్లో నల్లొండ జిల్లా నుంచి ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు?
కేటీఆర్: మొత్తం 12 వస్తాయని ఆశిస్తున్నాను.
మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా..ఎలా ఒదిగి ఉండాలో సలహా ఇవ్వరా?
కేటీఆర్: ఈ స్థానాలు శాశ్వతం కాదు. కళ్లుమూసి తెరిచేలోపు మాయమైపోతాయి.
జమిలి ఎన్నికలపై మీ అభిప్రాయం?
కేటీఆర్: స్వాగతిస్తున్నాను.
సర్ మీరు తమిళనాడుకు ముఖ్యమంత్రి అవ్వాలి? మీకు వీరాభిమానిని
కేటీఆర్: అది అంత సులువు కాదు.
ప్రపంచం మొత్తంలో మీకు నచ్చే రాజకీయ నేత?
కేటీఆర్: బరాక్ ఒబామా.
మీకు నచ్చిన హాస్యనటుడు?
కేటీఆర్: రాజకీయాల్లోనా(నవ్వుతూ)
సర్ మీరు అమ్మాయిలకు రిప్లై ఇవ్వట్లేదు
కేటీఆర్: నాకంత ధైర్యం ఉందా?
తర్వాతి తెలంగాణ సీఎం ఎవరు?
కేటీఆర్: కేసీఆర్