భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయన తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ , ప్రోటోకాల్, పోలీస్, జీహెచ్ఎంసీ., మెట్రో వాటర్ వర్క్స్, వైద్య , ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలు, టి.ఎస్.ఎస్ పిడిసిఎల్, ,బి.ఎస్.ఎన్.ఎల్, ఫైర్ , రెవెన్యూ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి మాట్లాడుతూ, రాష్ట్రపతి ఆగస్టు 4, 5 తేదీలలో రాష్ట్ర పర్యటనకు సంబంధించి అవసరమైన సిబ్బంది, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, గౌరవ రాష్ట్రపతి ప్రయాణించే మార్గాలలో రోడ్లకు మరమ్మత్తులు, అవసరమైన హెలిపాడ్ ల ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా , అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు, మంచి నీటి వసతి ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలన్నారు. సమాచార శాఖ ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు, లైవ్ కవరేజీ ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఆగస్టు 4 తేదీ న సాయంత్రం బేగంపేట విమానాశ్రయం చేరుకొని రాజ్ భవన్ లో బస చేస్తారని తెలిపారు. 5 వ తేదీ న ఉదయం బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటుతారని, అనంతరం కందిలోని IIT Hyderabad లో జరుగనున్న 7వ కాన్వకేషన్ లో పాల్గొంటారని తెలిపారు. బొల్లారంలో ఏర్పాట్ల పై హైదరాబాద్ కలెక్టర్ , కందిలో ఏర్పాట్ల పై సంగారెడ్డి కలెక్టర్ వివిధ శాఖలతో సమావేశాలు నిర్వహించాలని అన్నారు.