అర్హులైన ప్రతి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకుని సమన్వయంతో రైతు బీమా పథకాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. ఈ మేరకు మంత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో జడ్చర్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో రైతు బీమా పథకం మీద సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కెసిఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు పథకం కింద పంటల పెట్టుబడులే గాక, రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా అమలు అయ్యే విధంగా పథకాన్ని రూపొందించారన్నారు. 18 ఏళ్ళ నుండి 60ఏళ్ళ లోపు వయసున్న ప్రతి రైతుకి బీమా అందుతుందన్నారు. ఏ కారణం చేతనైనా రైతులు ప్రాణాలు కోల్పోతే, 15 రోజుల్లోవారి ఇంటికి బీమా డబ్బులు చేరే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం రైతు బంధు, రైతు బీమా పథకాలను చూసి ముచ్చటపడుతున్నారన్నారు. రైతాంగానికి పెద్దన్నలా కెసిఆర్ రైతులను ఆదుకుంటున్నారని చెప్పారు. చరిత్రలో లేని విధంగా ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత తీర్చారని, నకిలీల బెడదను లేకుండా చేశారన్ని, వ్యవసానికి అవసరమైన సాగునీటి కోసం కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు చేపట్టారని, పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావచ్చాయని వివరించారు. ఇంతగా రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం కానీ, సీఎం కానీ చరిత్రలో లేరన్నారు. స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉండాలని, తద్వారా తెలంగాణ ఆకుపచ్చ హరితమయం కావాలని సిఎం కోరుకుంటున్నారని చెప్పారు. రైతు కంట కన్నీరు రావొద్దని, రైతు పచ్చగా ఉంటేనే దేశం సుసంపన్నమవుతుందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.
మండలాలు, గ్రామాల వారీగా రైతుల వివరాలు, రైతు బీమాకు అర్హత పొందిన రైతుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళందరికీ రైతు బీమా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సమన్వయ సమితిల మండల కోఆర్డినేటర్లు వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామాల ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని బీమా పత్రాలు రైతులకు అందించాలన్నారు. గ్రామాల వారీగా టీములుగా ఏర్పడి, ఈ పథకాన్ని రైతు బంధుల చెక్కుల పంపిణీ మాదిరిగానే సక్సెస్ చేయాలని ఆదేశించారు.