మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమ్మాయిలను కిడ్నాప్ చేయాలంటూ యువకులకు పిలుపునిచ్చిన ఆయన తాజాగా నటి సోనాలీబింద్రే కన్నుమూసిందంటూ ట్వీట్ చేశారు. వాట్సాప్‌లో తనకు వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి దానిని ట్వీట్టర్‌లో షేర్ చేశారు. అందులో ‘‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు’’ దీంతో రామ్ కదమ్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పుడు వార్తను షేర్ చేసినందుకు ట్రోల్ చేస్తున్నారు.
దీంతో రామ్ కదమ్ తన ట్వీట్‌ను డిలీట్ చేసి, క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి బింద్రే గురించి వచ్చినదంతా అవాస్తవం. ఆమె త్వరగా కోలుకోవాలని గత రెండు రోజులుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్ చేసారు. మెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతోంది. తాను కేన్సర్ బారిన పడినట్టు ఈ ఏడాది జూలై 4న ఆమె వెల్లడించగా అందరూ ఆమె కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.