తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ మళ్లీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం ఓటుకు నోటుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ అదే తరహాలో ప్రజాస్వామ్య ఉల్లంఘనకు సిద్ధమవుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి ఇరు రాష్ట్రాల మధ్య రచ్చ మొదలుపెడుతున్నారు.
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు. ఆయన వందిమాగధులైన మీడియా, భజన చేసే తెలుగుతమ్ముళ్లు సెక్షన్ 8పై డిమాండ్లు చేశారు. అయితే కొద్దికాలం హడావుడి చేసి దాన్ని అలా వదిలేశారు. తాజాగా మరోమారు సెక్షన్8ను తెరమీదకు తీసుకువచ్చారు. తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎత్తుగడ వేశారు. దీంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. ప్రజాస్వామ్యవిలువలకు పాతర వేస్తోందని మండిపడ్డారు.
అయితే దీనిపై టీడీపీ నేతలు మళ్లీ వివాదం రాజేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఈ తరహా కామెంట్లు చేస్తోందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని.. ఏపీ పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు హైదరాబాద్ పై 2024 వరకు సర్వ హక్కులు ఉంటాయని ఆయన గుర్తుచేశారు. తెలుగు రాష్ర్టాల మధ్య మరో వివాదం రాజేసేందుకు పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేసి సెక్షన్ 8 పేరుతో రచ్చ సృష్టిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.