రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని చెప్పారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరుపై రెఫరెండంగా భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా వారి పనితీరుకు రెఫరెండంగా భావించాలని సవాలు విసిరారు. శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కే తారకరామారావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారని అన్నారు.
సీఎం కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో గూడుకట్టున్నారని, మరోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టామని, భవిష్యత్తులో ఇంకా చాలాచేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పించడంతోపాటుగా నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన ఉందని వెల్లడించారు. రాహుల్‌గాంధీది భస్మాసుర హస్తమని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనని వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రచారంచేస్తే గుజరాత్, కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమిపాలైందని గుర్తుచేశారు. త్వరలో కామారెడ్డి, బోథ్‌లో కూడా సభల్లో రాహుల్ పాల్గొనబోతున్నారని, అక్కడ కచ్చితంగా గెలుస్తామని, అక్కడేకాదు.. రాష్ట్రమంతా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి, ఎమ్మెల్యేల కొనుగోలుకు గతంలో కుట్రచేశారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌నే కొనుగోలుచేసే పనిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులను తోలుబొమ్మల్లా ఆడించాలనుకుంటున్నారు. బయటికి కాంగ్రెస్ కనిపిస్తుంది.. ఆడించేది మాత్రం చంద్రబాబే. ఉత్తమ్‌నో మరో నాయకుడినో ముందు పెట్టి ఆట ఆడిస్తారు. జగన్, పవన్ తమకు ఇక్కడేమీ పనిలేదనుకుని ఏపీలోనే పనిచేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్‌ను మోహరించారు. డబ్బులు ఇస్తున్నారు. టీడీపీని ఇక్కడ మూసేయాలని ప్రజలే చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇప్పటికి 30 లేఖలు రాశారు. ఒకవేళ వాళ్ల కూటమి వస్తే చంద్రబాబు మన ప్రాజెక్టులను ముందుకు పోనిస్తారా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన లోకేశ్.. ఇక్కడే చదువుకున్నాను. నేను లోకల్.. కానీ కేటీఆర్ గుంటూరులో చదివాడు.. అన్నారు. చివరికి లోకేశ్‌ను ఏపీలో మంత్రిగా చేశారు. ఇది తమకు ఇక్కడేమీలేదని పరోక్షంగా సంకేతాలు ఇవ్వటమే. వాళ్లకే ఇక్కడ అవసరంలేనప్పుడు వారి క్యాడర్ ఆ పార్టీలో ఎందుకు ఉంటది?