“వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.“ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందన ఇది. మరో ట్వీట్లో “తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే“ అంటూ కామెంట్లు చేశారు.
లోకేష్ తీరు తనంతతానుగా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా స్పష్టమవుతోందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్‌పై కామెంట్లు చేయబోయి ఆయన తనతండ్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడ్డంగా బుక్ చేశారని అంటున్నారు. జగన్ పదవి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి లోకేష్ కామెంట్లు నవ్వు తెప్పిస్తున్నాయని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో తన తండ్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును లోకేష్ ప్రశ్నించాలని అంటున్నారు. ఓటమికి భయపడి ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఆఖరికి కోర్టులచే మొట్టికాయలు కూడా తిన్న విషయం లోకేష్ విశ్లేషించుకోవాలంటున్నారు.
అంతకుముందు ఓటమి భయం వల్లే…పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడం లేదని మరోమారు లోకేష్ గుర్తుచేశారంటున్నారు.ఇక అధికార పీఠం విషయంలో లోకేష్‌ను మించిన ఉదాహరణ మరేమి ఉంటుందని పలువురు గుర్తుచేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి ఎమ్మెల్సీగా అయి అదే రీతిలో తండ్రి అధికారంతో మంత్రి అయిన విషయం అందరికీ తెలిసిందేనని…అలాంటి వ్యక్తి తనకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తానన్న పార్టీకి గుడ్‌బై చెప్పి..ఎంపీ పదవిని వదులుకొని ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిపై విమర్శలు చేస్తున్న తీరు చిత్రంగా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వాస్తవాలు ఉన్న నేపథ్యంలో లోకేష్ ప్రతిపక్ష నేతను కార్నర్ చేయబోయి తనతండ్రి తన విషయంలో చేసిన నిర్వాకాన్ని చాటుకున్నారని చెప్తున్నారు.