మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమకు వంద సీట్లు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటుగా ఆపార్టీ నేతలు పదే నమ్మకంగా చెబుతున్నారు. ఎంతో ధీమాగా ఉన్నారు. వంద కాకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీతో పాటు మరో 15సీట్లు అదనంగా వచ్చే అవకాశాలకు ఏమాత్రం కొదువ లేదని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అసలు టీఆర్ఎస్ గెలుపు విషయంలో ఇంత ధీమాగా ఉండటానికి కారణం దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణమట.. ఆసరా ఫించన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీతో పాటు ఎన్నో పథకాలను టీఆర్ఎస్ అమలు చేస్తోంది. ఇవన్నీ నేరుగా ప్రజలకు అందుతున్నాయని టీఆర్ఎస్ అధిష్టానంతోపాటు పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
ఒక్కో నియోజకవర్గంలో ఈ సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్య 60 వేలకు పైనే ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో ఆ సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. ప్రతి కుటుంబానికీ పథకాల ద్వారా లబ్దిదారులు ఉండడంతో కచ్చితంగా తమకు ఓటేస్తారనేది ఆపార్టీ నమ్మకం. ఈ రకంగా ప్రతీ నియోజకవర్గంలో తమకు 60 శాతం ఓట్లు కచ్చితంగా వస్తాయన్నది అధికార పార్టీ అంచనా. ఇదో దారిలో అభివృద్ధి పధకాలు, రాష్ట్రవ్యాప్తంగా మిషన్ కాకతీయ, భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ప్రజల్లో సానుకూలత ఉండడంతో మరికొన్ని కచ్చితంగా పడతాయనేది ఆ పార్టీ లెక్కగా కనిపిస్తోంది. వీరే కాకుండా లబ్దిదారులు కాని వారిలోనూ అనేకమంది తమకు ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
మరోవైపు 2004లో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా సంక్షేమ పథకాల కారణంగానే అధికారంలోకి వచ్చారనేది విశ్లేషకుల అంచనా.. అందుకే విపక్షాలన్నీ కూటమిగా కలిసినా… 2009లో ఆయనను ఓడించలేకపోయాయి. సేమ్ అదే తరహాలో ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో సానుకూలత ఎక్కువైందని తెలుస్తోంది.
ఇదే, ఈ ఆశీర్వాదమే తమను గెలిపిస్తుందని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉన్నారు. మరోవైపు ఈ నాలుగేళ్లుగా తెలంగాణలో కనిపించని కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు ఎన్నికల సమయంలో వేసే ఎత్తులను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అన్నిటికీ మించి తెలంగాణను తెచ్చి బాగు చేసిన కేసీఆర్ ను నమ్ముతాం కానీ ఆగం చేసిన కాంగ్రెస్ టీడీపీలను నమ్మబోమని తేల్చి చెప్తున్నారు.