బీజేపీ పరిపాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియజెప్పేందుకు…ఆ పార్టీ నాయకులు ఎలా ఆలోచిస్తున్నారో స్పష్టం చేసేందుకు ఇదే తార్కాణం ఈ ఘటన. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే షాకిచ్చేలా బీజేపీ నేత వ్యవహరించారు. పుదుచ్చేరికి చెందిన బీజేపీ కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన ప్రత్యక్ష ముఖాముఖీ కార్యక్రమంలో ఒక కార్యకర్త వేసిన ప్రశ్నతో ప్రధాని ఇరకాటంలో పడ్డారు. అప్పటికి ఏదో సమాధానం చెప్పి తప్పించుకోగలిగిగారు.
బీజేపీ కార్యకర్తలతో ప్రత్యక్షంగా ముచ్చటించి పార్టీని మరింత పటిష్టం చేయడానికి మార్గ నిర్దేశం చేద్దామని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. పుదుచ్చేరి బీజేపీ కార్యకర్తలతో ప్రధాని ముఖాముఖి సంభాషణలు జరుపుతుండగా, నిర్మల్ కుమార్ జైన్ అనే కార్యకర్త లేచి, కేంద్ర ప్రభుత్వం పన్ను వసూళ్లపైనే దృష్టి సారిస్తోంది తప్ప మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించడం లేదని అన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మీ సమాధానం ఏమిటని అతను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అవాక్కయిన ప్రధాని వెంటనే తేరుకుని తన ప్రభుత్వం సామాన్య ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ప్రశ్న వేసింది వ్యాపారి అయిన నిర్మల్ కుమార్ జైన్ కాబట్టి అతని నుంచి ఇటువంటి ప్రశ్న రావడం సహజమేనని ప్రధాని అన్నారు. వెంటనే ‘పురుచ్చేరి కో వణక్కం’ అంటూ ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రధాని ముగించేశారు.