బీజేపీకి పెట్టని గోడలా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ ఓటమితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వంఅలర్ట్ అయింది. ఈ రాష్ర్టాల్లో రైతుల ఆగ్రహమే ప్రధాన కారణమని భావించిన కమలనాథులు.. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా ప్రజలకు భారీగా తాయిలాలను ప్రకటించబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం దాదాపు లక్ష కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని ఓ అంచనా. గతేడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి, దిన దినం మసకబారుతున్న మోడీ ఛరిష్మా, బీజేపీపై సబ్బండ వర్ణాల్లో పెరుగుతున్న అసంతృప్తిని కప్పి పుచ్చుకోవాలంటే అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని బీజేపీ సర్కారు గ్రహించింది. దీంతో, మోడీ సర్కారు త్వరలో ప్రవేశపెట్టబోయే ఆఖరి బడ్జెట్‌లో రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తారని ప్రచారం జరుగుతోంది. రుణమాఫీతో పాటు తెలంగాణలో మాదిరి రైతుల ఖాతాలలోకే నేరుగా డబ్బులు చెల్లించే విధానాన్ని కూడా తీసుకొస్తారని సమాచారం. దీనికోసం బడ్జెట్‌లో అధిక మొత్తం ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది.
అంతేగాక, ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు కూడా భారీగా ఖర్చు చేయాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. దీంతోపాటు జీఎస్టీ కారణంగా నష్టపోతున్న చిన్న వ్యాపారులకు దగ్గర కావడానికి బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఇప్పటికే పలు వస్తువుల స్లాబ్ రేట్లను తగ్గించిన కేంద్రం.. మరికొన్నింటిని కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఇప్పటికే దేశ ఆర్థిక ద్రవ్యలోటు భయపెడుతుండగా.. మోడీ సర్కారు ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ పథకాల కారణంగా అది మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినా కూడా మోడీ సర్కారు తాయిలాల వైపే మొగ్గు చూపుతున్నదని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.