ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న డేటా లీకేజ్ కు విశాఖ నగరం కేంద్రంగా మారిందట.. విశాఖ నగరాన్ని ఐటీ హబ్ చేసేస్తామని చెబుతున్న చంద్రబాబు, లోక్‌శ్ లు విశాఖనే డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగానే డేటా అక్రమ వినియోగం కోసం కొన్నాళ్లుగా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తాజాగా కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ వ్యవహారం వెనుక హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు విశాఖకు చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ హస్తం ఉందట.. టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన సేవామిత్ర యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడుకోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
ఈమేరకు హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కొన్ని హార్ట్ డిస్క్ లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్వరరెడ్డి మాదాపూర్ పోలీసులకు చేసిన మరో ఫిర్యాదుతో విశాఖలోని బ్లూఫ్రాగ్ సంస్థ బాగోతం కూడా సడెన్ గా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్‌ఫోన్ ఆధారిత సేవల పేరిట వైజాగ్‌లోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ ప్రజల వివరాలు, ఆధార్ కార్డులు, ఏపీ స్మార్ట్ పల్స్ డేటాతో పాటు హైదరాబాద్‌లోని కావ్య డేటా మేనేజ్‌మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను సేకరిస్తోంది.
ఈ డేటా మొత్తాన్ని ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థకు అందిస్తోందని లోకేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే విశాఖలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్ ఫణిరాజు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సీఎంతో హెలికాప్టర్‌లో కూడా తిరిగేంతటి సాన్నిహిత్యం అతడికి ఉందని, పదేళ్ల కిందట సింగపూర్ నుంచి తిరిగొచ్చి విశాఖలో స్థిరపడిన ఫణి మొదట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత బ్లూ ఫ్రాగ్ సంస్థను నెలకొల్పిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారట.. పార్టీ యాప్‌లు, ఎన్‌టీఆర్ ట్రస్ట్కు సంబంధించిన ఐటీ సర్వీసులన్నీ ఆయనే చూసేవారని, ఈ క్రమంలోనే డేటా లీకేజి పనిని కూడా ఫణికే అప్పగించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.