ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై మండిపడ్డారు.. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ఒకసారి చెబితే వినాలని భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. అందుకు సాక్షి రిపోర్టర్ మీరు పిలిస్తేనే మీడియా సమావేశానికి వచ్చామన్నారు.
దానికి చంద్రబాబు బదులిస్తూ మిమ్మల్ని ప్రభుత్వ సమావేశాలకు కూడా రానివ్వనంటూ హుకుం జారీ చేశారు. మరోవైపు చంద్రబాబుతో పాటు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావులు కూడా సాక్షి విలేఖరిపై రెచ్చిపోయారు. చేయిచూపిస్తూ కుర్చోవాలని బెదిరింపులకు దిగారు. గతంలో చాలాసార్లు సాక్షి మీడియాపై చంద్రబాబుతో ఇదే విధంగా అవాకులు, చవాకులు పేలారు. సాక్షి పత్రికను చదవొద్దని పిలుపునిస్తూనే సాక్షి పత్రిక చదువుతూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.