నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన వైసీపీలో చేరుతారని సమచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి తరపున ఎంపీగా పోటి చేసి, అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు.
అయితే నారాయణ, సోమిరెడ్డిలకు మంత్రిపదవులు ఇచ్చినా ఆదాల పార్టీ కోసం కష్టపడి, నష్టపోయినా ఆయనను కనీసం చంద్రబాబు గుర్తించలేదు. అలాగే ఆదాల, సోమిరెడ్డి రాజకీయ ప్రత్యర్దులు కూడా.. ఇప్పుడు ఒకేపార్టీలో ఉన్నా వారి మధ్య విబేధాలు సద్దుమణగట్లేదట.. ఇటివల ఆదాల వర్గానికి చెందిన కొంతమంది నేతలు వైసిపిలో చేరిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సోమిరెడ్డి ఆదాలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వొద్దని చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7అసెంబ్లీల్లో కూడా సోమిరెడ్డి, నారాయణల మనుషులకే టికెట్లు కేటాయించానే విమర్శలున్నాయి. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తున్నా కొంతమంది ఇబ్బందిపెట్టడం తనకు బాధ కలిగించిందని, ఇదంతా చంద్రబాబుకు చెప్పినా ఆయన నుంచి స్పందన లేదనేది ఆదాల అనుచరుల వాదన..
దీంతో వైసీపీలో చేరుతారని, ఇప్పటికే తన అనుచరులను పంపించారని ఆయన చేరిక అతి త్వరలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూనే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారట. ఆయన పార్టీ మారనున్న నేపధ్యంలో ఆదాల కార్యాలయం ముందు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించారట.. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీచేయనున్నరని తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం ఆయనకు నెల్లూరు రూరల్ టికెట్ కేటాయించిన మర్నాడే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, టీడీపీనేతలకు అందుబాటులోకి రాకపోవడంతో మరికొద్ది గంటల్లోనే ఆదాల ఫ్యాను గూటికి చేరనున్నట్టు అర్ధమవుతోంది.