ఏపీ పోలీసులు ఇంకా తమ స్వామిభక్తిని నిరూపించుకుంటున్నారు.. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినా పోలీసుల తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు.. ఈసీ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి వైసీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై కృష్ణానదిలో అక్రమంగా ఇసుక దిబ్బలను నిర్మించి, అవి తమ పరిధిలోనివే అని తప్పుడు ధ్రువపత్రాలను సృష్టిస్తున్నారు.
రాజధాని అమరావతి పరిధిలో ప్రస్తుతం భూమి ధరలకు రెక్కలు రావడంతో కృత్రిమంగా నిర్మించిన దిబ్బల్లో రిసార్టులు, క్లబ్‌లు ఏర్పాటు చేసి కోట్లాదిరూపాయలు దోచుకునేందుకు వైసీపీ నేతలు ఈ అక్రమాలపై ప్రశ్నిస్తుండటాన్ని తట్టెకోలేకపోతున్నారు. వైసీపీ నేతలు నదిలో పర్యటిస్తే తమ అక్రమాలు బయటపడతాయోనని టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని చూస్తున్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని గుంటుపల్లిలో టీడీపీ నేతలు ఏకంగా నదీ గర్భాన్నే ఆక్రమించేసారు. దాదాపుగా 65 ఎకరాల్లో పాగా వేసి ఇసుక దిబ్బలను ఏర్పాటు చేసారు. తాజాగా ఈ ఘటనను వైసీపీ నాయకులు వెలుగులోకి తెచ్చి పోరాడటంతో జిల్లా కలెక్టర్ స్పందించి ఆ దిబ్బలను సీజ్ చేయించారు.
దీంతో వారి అక్రమాలు బయటపడకుండా అధికార పార్టీ నాయకులు పోలీసులను రంగంలోకి దింపారు. నదిలోకి వైసీపీ నేతలు ప్రవేశిస్తే అరెస్ట్ చేస్తామని రాజధాని పరిధిలోని తుళ్లూరు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అక్రమార్కుల్ని అడ్డుకోవాల్సిన పోలీసులు వాటిని అడ్డుకుంటున్న వైసీపీ నేతలకు హెచ్చరికలు ఇవ్వడం పట్ల వైసీపీనేతలు షాక్ కు గురవుతున్నారు. ఈఘటనపై తుళ్లూరు సీఐ శ్రీకాంత్‌బాబును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ విధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. తాము ఇక్కడే పుట్టి పెరిగామని, ఇప్పటివరకూ ఎవరూ నదిలోకి వెళ్లొద్దని ఆంక్షలు విధించలేదని, పోలీసులు టీడీపీ నాయకులకు అండగా నిలుస్తున్నారని అసలు నదిలోకి వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైసీపీ బాపట్ల ఎంపీ అభ్యర్ధి నందిగం సురేష్ సహా పలువురు నేతలు తీవ్రంగా పోరాడుతున్నారు.