కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి. 2019 ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని గంపెడాశలతో ఉన్నచంద్రబాబుకి ఆంధ్రా ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష స్థానానికి కూడా నోచుకోకుండా టీడీపీని అదః పాతాళానికి అణగదొక్కేశారు. ఇంతటి భారీ పరాభవాన్ని ఊహించని చంద్రబాబు అండ్ టీమ్ ఓటమికి గల కారణాలు వేతికే పనిలో పడింది.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా జగన్ రాకను స్వాగతించింది. రాష్ట్రవ్యాప్తంగా చేసిన సుధీర్ఘ పాదయాత్ర, వైసీపీ నవరత్నాలు, పీకే వ్యూహాలు, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలు.. ఇలా జగన్‌కు అన్ని అంశాలు కలిసిరాగా.. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనుసరించిన వ్యూహాలు, పలు తప్పుడు నిర్ణయాలే టీడీపీ భారీ ఓటమికి మూలకారణాలుగా అనుకోవచ్చు.
ఇంతకీ చంద్రబాబు అనుసరించిన ఆ తప్పుడు వ్యూహాలు ఏంటి?
1. ఒంటరిగా పోటీ చేయడం.
నలభై ఏళ్ల తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేదు. ప్రతీ ఎన్నికల్లోనూ ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టుకోవడం ఆ పొత్తుతో లాభపడటం తెలిసిందే. గత ఎన్నికల్లోనూ బీజేపీ, పవన్, టీడీపీ పొత్తు. పవన్ సినిమా గ్లామర్, బీజేపీ మోడీ హవాతో 2014 ఎన్నికల్లో అతితక్కువ ఓట్ షేర్‌తో ఎట్టకేలకు అధికారం సంపాదించిన చంద్రబాబు, ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేశారు. సరిగ్గా ఇదే అంశం టీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఒంటరిగా పోటీ చేయడం ఎంత ప్రమాదకరమో ఫలితాలు తేల్చిచెప్పాయి. ఇలా ఒంటరిగా పోటీ చేయడమే చంద్రబాబు చేసిన మొదటి తప్పిదం.
2. పార్టీ టిక్కెట్ల కేటాయింపు.
ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో చంద్రబాబు తీవ్ర జాప్యం చేశారు. 3, 4 విడుతలుగా టిక్కెట్లు కేటాయించడంలో చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ పరిణితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తగినంత సమయం లేకపోవడం. సిట్టింగ్‌లకే ఎక్కువగా టిక్కెట్లు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం. 40 మందికిపైగా సిట్టింగ్‌లపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ వారివైపే చంద్రబాబు మొగ్గుచూపడం. సుమారుగా సిట్టింగ్‌లందరూ ఓటమి పాలవ్వడం చంద్రబాబు చేసిన 2వ తప్పిదంగా చెప్పుకోవచ్చు.
3. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం.
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం. ఎవరెన్ని మాటలన్నా.. పవన్‌ను రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యంగా చెప్పుకోచ్చు. కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చుకోకపోవడం. ముఖ్యంగా పవన్ తన కమ్యూనిటీగా చెప్పుకునే కాపు ఓట్లను చీల్చుతాడని వ్యూహాలు రచించుకోవడం. పవన్ చీల్చిన ఓట్లు పూర్తి స్థాయిలో వైసీపీకి లాభించడం, ఆశించిన స్థాయిలో పవన్ రాణించలేకపోవడం. పవన్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం మూడవ తప్పిదంగా చెప్పుకోవచ్చు.
4. రెండు కళ్లు, రెండు నాలుకల ధోరణి.
గతంలో తెలంగాణ అంశంలోనే చావుదెబ్బ తిన్న చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం. ఈ సారి రెండు నాలుకల సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ప్రత్యేక హోదాపై స్పష్టమైన ధోరణి లేకపోవడం. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పడం. ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజీనే ఆంధ్రప్రదేశ్‌కు శ్రీరామరక్ష అంటూ రెండు వాదనలు వినిపించిన చంద్రబాబు. సరిగ్గా ఇదే అంశంలో ప్రజల విశ్వసనీయతను కోల్పోయారు. నాల్గవ తప్పిదంగా చెప్పుకోవచ్చు.
5. వ్యక్తిగత ధూషణలు.
నిత్యం వార్తల్లో ఉండాలని భావించే చంద్రబాబు, అనేక ఎన్నికల ప్రచార సభల్లో, ప్రెస్‌మీట్‌లలో నోటి దురుసును చూపించుకుంటూ వచ్చారు.
తన ప్రభుత్వం ఉన్నహయాంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పలేకపోవడం. తమ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన చంద్రబాబు వాటిని పక్కనపెట్టి, పక్కరాష్ట్రంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అనుసరించే క్రమంలో చంద్రబాబు బొక్కబోర్లాపడ్డారు. జగన్, కేసీఆర్, మోడీలను తిట్టడమే విధిగా పెట్టుకున్నచంద్రబాబు తాము చేసిన పనులను ప్రజల్లోకి తీసుకుపోలేకపోయారు. ఈ వ్యక్తిగత ధూషణలే ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ఇదే 5వ తప్పిదంగా చెప్పుకోవచ్చు.
6. డ్వాక్రా – రైతు రుణాల మాఫీపై చంద్రబాబు వైఖరి.
2014 ఎన్నికలకు ముందు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు అది అమలు చేసే విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. విడతల వారీగా కొంత మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిన చంద్రబాబు డ్వాక్రా మహిళల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో అమలు చేయలేక పోయారు. రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళలకు వాటిని మాఫీ చేయకపోగా.. పుండుపై కారం చల్లినట్లుగా పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు గాలం వేయజూశారు. సరిగ్గా ఇదే అంశాన్ని మహిళలు కూడా ఎన్నికల తాయిలాలుగానే భావించారే తప్పా, సంక్షేమ పథకంగా మహిళలు భావించలేరు, టీడీపీకి ఓట్లు కూడా వేయలేదు. ఇదే చంద్రబాబు ఓటమికి 6వ అంశంగా చెప్పుకొవచ్చు.
7. ఓటుకు నోటు, డేటా చౌర్యం.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చంద్రబాబు దూతగా వెళ్లిన రేవంత్ రెడ్డి ఓటుకు 5 కోట్ల రూపాయల ఇవ్వజూపిన అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆడియో రికార్డింగ్‌లు సైతం బయటికి రావడం, చంద్రబాబు కూడా జైలుకు వెళ్తారనేంత స్థాయికి పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత ఇటివలి టీడీపీ మెంబర్‌షిప్ డ్రైవ్ అంటూ ఆంధ్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పనంగా అప్పగించారని, ఆ సంస్థ ముఖ్యులను చంద్రబాబే దాచిపెడుతున్నారంటూ తెలంగాణ పోలీసులు ఏపీ ప్రభుత్వంపై డేటా చోరీ కేసు పెట్టడం చంద్రబాబును ఇరుకున పెట్టాయి. వ్యక్తిగత సమాచారం విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని, చంద్రబాబుపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు. ఇదే టీడీపి ఓటమికి 7వ కారణం.
8. అమరావతి ఆలస్యం, కేంద్ర నిధుల్లో గోల్‌మాల్.
అమరావతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజల ఆశలను చంద్రబాబు గల్లంతు చేశారు. అమరావతిని సింగపూర్, మలేషియా చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు ఐదేళ్ల అమూల్యమైన సమయ్యాన్ని వృధా చేశారు. పూర్తిస్థాయిలో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించకపోగా, తాత్కాలిక భవనాలు అంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తూ, రాష్ట్రంలోని పాలనంతా మరిచి పూర్తి దృష్టంతా అమరావతిపైనే ఉంచారు. అంతేగాక కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదోవ పట్టాయని, స్వంత ప్రయోజనాలకు వాడుకున్నారన్న ఆరోపణలు ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్నే చూపించాయి. ఇదే అంశం చంద్రబాబు ఓటమికి 8వ కారణంగా చెప్పుకోవచ్చు.
9. రాజధాని రైతుల భూములు, జన్మభూమి కమిటీలు.
రాజధాని విషయంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్‌పూలింగ్ చేసిన చంద్రబాబుపై అక్కడి రైతులు తీవ్ర వ్యతిరేకత చూపించారు. అన్యాయంగా అతితక్కువ ధరలకే తమ భూములు ప్రభుత్వం అక్రమంగా లాగేసుకుంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం బయటకు పొక్కకుండా ఎల్లో మీడియాతో కొంతవరకు కప్పిపుచ్చగలిగాడు. ఇదే మంగళగిరి ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఇక జన్మభూమి కమిటీల అగడాలు అప్పట్లో సోషల్‌మీడియా వేదికగా చాలా వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పథకాల్లో వారికే ఎక్కువ ప్రధాన్యతలివ్వడం. ప్రతీ విషయంలోనూ జన్మభూమి కమిటీ సభ్యులు రెచ్చిపోవడం టీడీపీ వైఫల్యానికి 9వ కారణంగా చెప్పుకోవాలి.
10. అసెంబ్లీలో టీడీపీ వైఖరి.
ప్రజల ఓట్లతోనే గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై శాసనసభలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. చీటికీ మాటికీ వైసీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా భావించే ప్రతిపక్షం గొంతు అసెంబ్లీలో వినిపించకుండా చేయడం ప్రజలను తీవ్ర అసహనానికి గురిచేసింది. అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యుల తీరు, వాడిన పదజాలం కూడా ఏపీ ప్రజానీకాన్ని విస్మయపరిచింది. చంద్రబాబు ఘోర పరాజయానికి ఇవే పది ప్రధానమైన కారణాలుగా నిలిచాయి.