సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు సంచలన సృష్టించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ అంశాల గురించి స్పందించారు. “సైకిల్ చక్రం తిరిగి తిరిగి ఇప్పుడు పంచర్ అయ్యింది. ఎన్టీఆర్ జీవితం చివరి రోజుల్లో జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తీశాను. ఎన్నికల కోడ్ తెలంగాణ లో ఉన్నా రిలీజ్ చేశాం, ఏపీలో అడ్డుకున్నారు. విజయవాడలో నా ప్రెస్ మీట్ పెట్టకుండా అన్యాయంగా అడ్డుకున్నారు. ఒక కీలక వ్యక్తి ఫోన్ చేయడం వల్ల నన్ను బలవంతంగా వెనక్కి పంపారు.ఆ వ్యక్తి ఎవరు అనేది త్వరలోనే బయటకు వస్తుంది.“ అని వర్మ అన్నారు.
ఏ వ్యక్తి పొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో అదే వ్యక్తి ని ఎలా వెన్నుపోటు పొడిచారో చూపించామని పరోక్షంగా చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. “నిజం తెలియడం ఆలస్యం కావచ్చేమో .. కానీ తెలియక తప్పదు…మే 31న మా లక్ష్మీస్ యన్టీఆర్ ఎపి లో విడుదల చేస్తున్నాం. రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడితే.. ఎండలో అభిమానులు ఇబ్బందులు పడతారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందనే ఈరోజు నేనే వేదిక మార్చాను. ఆరోజు నన్ను బలవంతంగా అడ్డుకుని పంపించారు. ఒక్క ఫోన్ కాల్ ఆధారంగా బలవంతంగా పోలీసులు పంపించారు.. ఇప్పడు వాళ్లే గౌరవం గా తీసుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రమే నేను తీశాను. చంద్రబాబు ఏదో ఊహించుకుని వారే వివాదం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ దేశం అంతా ఉంటే ఎపి లోనే నా సినిమాకు అత్యంతరం ఎందుకు అనేదే నా ప్రశ్న. మహరాజులా బతికిన ఎన్టీఆర్‌ను డెబ్బై ఏళ్ల వయసులో ఇబ్బందులు పెట్టారు. మళ్లీ అదే ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని రాజకీయాలు చేయడం నాకు కరెక్ట్ కాదనిపించింది. “ అని అన్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బిజీలో ఉండి పవన్ కళ్యాణ్ విషయాలను నేను పట్టించుకోలేదని వర్మ అన్నారు. “చిరంజీవికి 18సీట్లు వస్తే, పవన్ కు ఒక్క సీటు వచ్చిందని విన్నాను. నా దృష్టిలో పవన్ జనసేన తో పోలిస్తే చిరంజీవి ప్రజారాజ్యం బాహుబలి వంటిది. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు నా తర్వాత సినిమా! విజయవాడ వచ్చాకే ఈ సినిమా ఆలోచన నాకు వచ్చింది. కాంట్రవర్సీ అంశాల పై సినిమా లు తీయడం నాకు ఇష్టం. నాకు ఎవరినైనా గిల్లడం ఇష్టం.. నేను అలాగే ముందుకెళతా! చంద్రబాబు పరాజయానికి ఆయన చెప్పిన పనులు చేయకపోవడం ఒక కారణం.. జగన్, లోకేష్ లు మరో కారణంగా భావిస్తున్నా..“ అని వర్మ పేర్కొన్నారు.