అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ గత పదేండ్లుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమీ ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మార్చి కొత్తగా నియమించనున్నారు అనే వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,అటు సోషల్ మీడియా తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు అయిన సుష్మస్వరాజ్ ను తెలంగాణ ఏపీ రాష్ట్రాల గవర్నర్ గా నియమించనున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే తనని గవర్నర్ గా నియమిస్తున్నారని వస్తోన్న వార్తలపై కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్టర్ సాక్షిగా స్పందిస్తూ”ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి అధికారక సమాచారం కానీ ఆదేశాలు అందలేదు.అందుకే ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదు”అని ఆమె ఖండించారు.
అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల గురించి వస్తోన్న వార్తలపై బీజేపీ అధిష్టానం కానీ సర్కారులో ఉన్న పెద్దలు కానీ స్పందించకపోవడంతో గవర్నర్ మార్పు ఖాయమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మొదటి నుండి తెలంగాణ రాష్ట్రంపై సానుకూల భావన ఉన్న సుష్మస్వరాజ్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా.. ఈఎస్ఎల్ నరసింహాన్ ను ఏపీ గవర్నర్ గా నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవముందో..?