తమను నమ్ముకున్న వారిని ఆదరించడంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం తర్వాతే ఎవరైనా అని ఇటు తెలంగాణ అటు ఏపీలో గుక్క తిప్పుకొకుండా చెప్తారు. తాజాగా మరోసారి మేము ఇలాంటివాళ్లమని నిరూపించాడు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. సీఎం కార్యాలయంలో స్పెషలాఫీసర్‌గా చిన్న పిల్లల వైద్యుడు కొత్తచెరువు(అనంతపురం జిల్లా)కి చెందిన హరికృష్ణ నియామకం పట్ల మండల, నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
గతంలో మండల కేంద్రమైన కొత్తచెరువులో చిన్న పిల్లల క్లీనిక్‌ను డాక్టర్ హరికృష్ణ స్థాపించారు. ఈ క్రమంలోనే వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో వారి వెంట నడిచే విధంగా చేసింది. షర్మిల పాదయాత్రలో 3,112 కిలో మీటర్లు, వైఎస్ జగన్‌తో 3,648 కిలోమీటర్లు వారి వెంట నడిచారు.జగన్ అడుగులో అడుగు వేస్తూ ప్రజలు జగన్‌కు ఇచ్చే వినతులను డాక్టర్ స్వీకరిస్తుండేవాడు.
జగన్ ఆదేశాలతో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. ప్రతి నిత్యం వైఎస్ జగన్‌కు అందుబాటులో ఉంటూ ముఖ్యమైన సమాచారాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆయన మదిలో ముద్ర వేసుకున్నారు. ఇంత కష్టపడిన హరికృష్ణకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషలాఫీసర్‌గా నియమించడంతో నమ్ముకున్న వారికి వైఎస్ కుటుంబం అండగా నిలుస్తుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు.