యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాగం నిర్వహణ ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్ స్వామితో చర్చించారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్.. యాగం నిర్వహణపై స్వామీజీతో చర్చించారు. 1048 యజ్ఞ కుండాలతో.. 3 వేల మంది రుత్వికులు, మరో 3వేల మంది సహాయకులతో మహాయాగం నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, భద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే, కేంద్రం, రాష్ట్రాల పెద్దలు, గవర్నర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ యజ్ఞం నేపథ్యంలో లక్షలాది సంఖ్యలో భక్తులు దివ్యక్షేత్రానికి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేఅంశంపై ప్రధానంగా చర్చించారు.
