మూవీ పేరు: మన్మథుడు 2
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు
మాటలు: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్
కూర్పు: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
కథనం: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
కళ: ఎస్.రామకృష్ణ, మౌనిక
సంగీతం: చైతన్య భరద్వాజ్
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
కథ
సాంబశివరావు అలియాస్ శామ్ (నాగార్జున అక్కినేని) కుటుంబం పోర్చుగల్‌లో ఉంటుంది. అప్పుడెప్పుడో మూడు తరాల ముందు లేబర్లుగా వేరే దేశానికి విజయనగరం నుంచి వెళ్తున్న వారి కుటుంబం మధ్యలో పోర్చుగల్‌కి చేరుకుంటుంది. అలా ఆ బోటులో వెళ్లిన వాళ్లందరూ కెసాండ్రాలో స్థిరపడతారు. దాన్ని కాసాంధ్రా కింద మారుస్తారు. జనాబా క్రమేణ పెరిగి పెద్దదవుతుంది. పొరుగు దేశాన ఉండటం వల్ల కుటుంబంలో ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. సాంబశివరావు 12 ఏళ్లున్నప్పుడే తండ్రి చనిపోతాడు. తల్లి (లక్ష్మి) అతన్ని పెంచుతుంది. అతనికి ఇద్దరు అక్కలు (ఝాన్సీ, దివ్య దర్శిని), ఒక చెల్లెలు(నిశాంతి) ఉంటారు. అందరికీ పెళ్లిళ్లయిపోయి ఉంటాయి. సాంబశివరావుకు అప్పుడెప్పుడో లవ్ ఫెయిల్యూర్ (కీర్తిసురేష్ తో) కావడంతో అతను మళ్లీ పెళ్లి జోలికి వెళ్లడు. ఇంట్లో వాళ్ల ముందు వర్జిన్‌గా నటిస్తూ, బయటమాత్రం రాసలీలలు కొనసాగిస్తుంటాడు. అతని వృత్తి పెర్ఫ్యూమ్ తయారుచేయడం. ఉన్నట్టుండి సాంబశివరావు తల్లి అతన్ని మూడు నెలల్లో పెళ్లి చేసుకోమని అంటుంది. సరిగ్గా ఆ సమయంలో తన కుటుంబసభ్యుల ముందు తన ప్రేయసిగా నటించడానికి అవంతిక (రకుల్ ప్రీత్‌సింగ్)తో బేరం కుదుర్చుకుంటాడు. తీరా పెళ్లి సమయానికి ముందే అనుకున్నట్టు అవంతిక అక్కడికి రాదు. దీంతో సాంబశివరావు తల్లి సగం కోమాలోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏమైంది? సాంబశివరావు తల్లి కోసం అవంతిక తిరిగి వచ్చిందా? అతని నిజ స్వరూపం తెలుసుకున్న అక్కచెల్లెళ్లు ఏం చేశారు? మధ్యలో కిశోర్ (వెన్నెల కిశోర్) ఏం చేశాడు? సాంబశివరావు మావయ్య (రావు రమేష్)కు ఉన్న అనుమానాలేంటి? వాటిని ఇంట్లో వాళ్ల ముందు ఎలా బయటపెట్టాడు? అసలు కాకరకాయ కూరకు ఆ ఇంట్లో ఉన్న స్టోరీ ఏంటి? వంటివన్నీ ఆసక్తికరం.
విశ్లేషణ
జీవితంలో పలు రకాలైన అనుభవాల దృష్ట్యా పెళ్లి మీద విరక్తి కలిగి, సోలోగా బతకడానికి ఇష్టపడిన ఓ వ్యక్తి కథ ఇది. కుటుంబాన్ని కన్విన్స్ చేయడం కోసం ఓ అమ్మాయిని తీసుకెళ్లి వారికి పరిచయం చేస్తాడు. అమ్మాయికి, కుటుంబానికి మధ్య అనుబంధం మరింత ఎక్కువ కావడం వల్ల చిక్కుల్లో పడతాడు. తమ ఇంట్లో వాళ్లని నమ్మించడం కోసం ప్రేమిస్తున్నానంటూ ఓ వ్యక్తిని తీసుకెళ్లి ఇంట్లో వాళ్లను మోసం చేసే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించదు. ఇంతకు పూర్వం చాలా సినిమాల్లో ఇలా హీరో అయితే హీరోయిన్ నీ, హీరోయిన్ అయితే హీరోనీ తీసుకెళ్లడాన్ని చూసి ఉన్నాం. కానీ ఇందులో ఓ మధ్య వయస్కుడు ఆ పని చేసినట్టు చూపించడం కాస్త కొత్తగా ఉంది. దానికి తగ్గట్టు మన సినిమాల్లో ఎక్కువగా వినిపించే ఆంగ్ల పదాల స్థానంలో ఇందులో పోర్చుగీస్ వినిపిస్తుంది. లొకేషన్లు కూడా కొత్తగా ఉంటాయి. హీరో చేసే వృత్తి కూడా ఇప్పటిదాకా ఎక్కడా తెలుగు సినిమాల్లో రానిది. అసలు పెర్ ఫ్యూమ్ మేకర్ అనే కాన్సెప్ట్ మన ఆలోచనలకు అంతగా అందనిది. రకుల్ వెయిట్రెస్‌గా నటించింది. అందాల ఆరబోతకు కొరతలేదు. గ్లామర్‌తో తెరను మరికాస్త హీటెక్కించింది. డబుల్ మీనింగ్ డైలాగులకు అసలు కొదవేలేదు. ‘నాకు తెలుగులో బూతులు రావు’ అని హీరో చెప్పే డైలాగును బట్టి, అంతకు ముందు అతను చెప్పిన పోర్చుగీస్ భాషలో అది బూతు అనిఅర్థం చేసుకోవచ్చు. రకుల్-ఝాన్సీ మధ్య వచ్చే సన్నివేశం, హీరో లవ్ మేకింగ్ సీన్లో చూపించే సింబాలిక్ షాట్స్ వంటివి తెలుగువారికి కొత్తే. కెమెరా పనితనం బావుంది. ఓబేబీలో బాధ్యతగల బామ్మగా నటించిన లక్ష్మికి ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ పాత్ర ఇచ్చారు. ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. హీరో అక్కలుగా ఝాన్సీ , దేవదర్శిని, చెల్లెలుగా నిశాంతి బాగా చేశారు. కీర్తి సురేష్, సమంత కనిపించిందే కాసేపు అయినా చమక్కుమనిపించారు. పాటలు పెద్దగా మనసుకు ఎక్కవు. మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉండవు.
ప్లస్ పాయింట్లు
– నటీనటుల నటన
– లొకేషన్లు
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
– కెమెరా
మైనస్ పాయింట్లు
– ఊహకు అందే క్లైమాక్స్
– కొన్నిచోట్ల కుదరని మేకప్
– పలు సందర్భాల్లో సహజంగా లేకపోవడం
బాటమ్ లైన్: ఇటు మెప్పించలేదు.. అటు నొప్పించలేదు
రేటింగ్: 1.25/5