ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి.
ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మొదలయ్యాయి. అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణ అంశాల పై మళ్లీ మాటల తూటాలు మొదలయ్యాయి. ఇళ్ల నిర్మాణాల పై టీడిపి సభ్యులు సభలో చర్చ మొదలెట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని,ఇళ్ల నిర్మాణం పై హౌస్ కమిటీ వేయాలని టీడిపి అచ్చెనాయుడు కోరారు. రాష్ట్రం రివర్స్ టెండరింగ్ వల్ల అధోగతి పాలవుతుందని టీడిపి నాయకులు ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానాలు ఇచ్చారు.గతంలో టీడిపి అధికారంలో ఉన్నప్పుడే ఇళ్ల నిర్మాణంలో అవినీతి విపరీతంగా జరిగిందని మంత్రి ఆరోపించారు. అందువలనే ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని, రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వానికి దాదాపు రూ.106 కోట్లు ఆదాయం వచ్చిందని బొత్స తెలిపారు. టీడీపీ హయంలో ఇళ్ల నిర్మాణంలో వేల కోట్ల దోపిడిని బయటపెడతామని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి లబ్దిదారుడి నుండి రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఇళ్లను ఇవ్వమని సీఎం జగన్ ఆదేశించినట్టు బొత్స తెలిపారు. ఇళ్ల నిర్మాణం కు సంబంధించి రెండు టెండర్లలో రివర్స్ టెండరింగ్‌కి వెళ్తే.. ప్రభుత్వానికి సుమారు రూ. 150 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో టిడిపి ప్రభుత్వం హడావిడిగా ఇళ్ల నిర్మాణ పనులను మొదలుపెట్టిందని, ఐదు లక్షల ఇళ్లకు మూడు లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి , దానిలో 70 వేల ఇళ్లు మాత్రమే 90శాతం పూర్తచేశారని మంత్రి విమర్శించారు. 5 సంవత్సరాల కాలంలో టిడీపి ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయకపోవడం ఆ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు బొత్స . సభలో టీడీపి అవాస్తవాలను చెబుతోందని, టెక్నాలజిని మార్చకుండా రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని మంత్రి సమాధానామిచ్చారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడిపి దోపిడి చేసిందని , కానీ వైసీపి ప్రభుత్వం చిత్తశుద్దితో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రయత్నిస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు.