సిద్ధిపేట జిల్లా ప్రజల అద్భుతమైన కల ఆవిష్కృతం కాబోతున్నది. రెండు రోజుల్లో రంగనాయ సాగర్ కు గోదావరి జలాలు వస్తాయి. కరోనా రావడంతో నీళ్ల పండుగ జరపడం లేదు. కరోనా పోయినంక నీళ్ల పండుగ జరుపుకుందామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజాంబీల్ ఖాన్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరి రామ్, సిద్ధిపేట, హుస్నాబాద్ ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులతో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలు, పిల్ల కాల్వలకు చెందిన భూ సేకరణ పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ చివరి దశలో రాజన్న సిరిసిల్లా – సిద్ధిపేట జిల్లాలకు చెందిన అంతగిరి రిజర్వాయరుకు 3.5 టీఏంసీకి 1.4 టీఏంసీకి నీళ్లు చేరుకున్నాయని, రేపు మంగళవారం ఉదయం 11 గంటలకు 1.7 టీఏంసీ నీళ్లు అంతగిరి రిజర్వాయరుకు నీళ్లు చేరబోతున్నాయని, ఆ రిజర్వాయర్ లక్ష్యం నెరవేరిందని మంత్రి పేర్కొన్నారు. నిన్నటి ఉదయం నుంచి రాత్రిoబవళ్లు అధికారులు చేసిన కృషితో నిర్ధేశిత సామర్థ్య లక్ష్యానికి అంతగిరి రిజర్వాయరుకు నీళ్లు చేరుతున్నట్లు మంత్రి వివరించారు.
కాళేశ్వరం జలాలు వస్తున్నందున ఈ ఎండా కాలంలోనే చెరువులు, కుంటలు నింపాలని సీఏం కేసీఆర్ చెప్పారని మంత్రి వెల్లడించారు.
అధికారులందరీ సహకారంతో ప్రాజెక్టు పని పూర్తయ్యింది. అనితర సాధ్యమైన పనిని పూర్తి చేసి రాష్ట్రానికి, దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఎన్నో కష్ట, నష్టాలను ఎదుర్కొని, కొన్ని ఛాలెంజెస్ లెక్క చేయకుండా చాలా అద్భుతంగా పని చేసిన రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జిల్లా ప్రజల పక్షాన అభినందనలు, ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
మూడు రోజుల నుంచి కాల్వల వెంట తిరిగి క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించామని, అక్కడక్కడా చిన్న చిన్న భూ సమస్యలు ఉన్నాయని, ప్రధానమైన పిల్ల కాల్వల భూ సేకరణ అంశాలపై అధికారులను ఆరా తీశారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ కింద ప్రధాన కుడి కాలువలో ముఖ్యంగా ఎల్డీ-4, ఎల్డీ-10లో 120 ఏకరాల భూ సేకరణ చేయాల్సి ఉందని, వెంటనే చేసేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. అదే విధంగా ప్రధాన ఎడమ కాలువలో ఆర్-2, ఆర్-3, ఎల్ఎం-4 కింద 55 వేల ఏకరాలకు నీళ్లు అందుతాయని, ఆయా మండలాల్లోని ప్రధానమైన చెరువులు, కుంటలు నింపేందుకు కావాల్సిన భూ సేకరణ చేయాలని తహశీల్దార్లను ఆదేశిస్తూ., జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ చొరవ చూపాలని మంత్రి సూచించారు.
సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోని సిద్ధిపేట మండలం మల్లన్న సాగర్ ఆధారపడి ఉన్నదని, ఇందు కోసం కావాల్సిన భూ సేకరణ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సహకారం అందిస్తారని, అదే విధంగా పలు మండలాల్లో భూ సేకరణకు సహకరించిన, సహకరించని జాబితా సేకరించి., అసంపూర్తిగా పెండింగులో భూ సేకరణకు ఉన్న వాటిని క్లియరెన్స్ చేయలని జిల్లా కలెక్టర్ కు మంత్రి సూచించారు. మల్లన్న సాగర్ ప్రధాన కాలువతో దుబ్బాక నియోజకవర్గంలో 66 వేల ఏకరాలకు, రాజన్న సిరిసిల్లా జిల్లాకు 21 వేల ఏకరాలకు, సిద్ధిపేట నియోజక వర్గంలో 35 వేల ఏకరాలకు, గజ్వేల్ కు 1543 ఏకరాలకు ఆయకట్టు కింద సాగునీరు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
మల్లన్న సాగర్ జలాశయం కింద దుబ్బాక, గజ్వేల్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు నీళ్లు వచ్చే ప్రధాన కాలువ కింద చేయాల్సిన భూ సేకరణ యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ లకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన ఓటీ పెట్టి, పీడీ పబ్లిషింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు.
– మల్లన్న సాగర్ ప్రధాన కాలువ తొగుట, సిద్ధిపేట, దుబ్బాక, రాజన్న సిరిసిల్లా ముస్తాబాద్ కలుపుతూ ప్రధాన కాలువ వెళ్తుంది. ఈ ప్రధాన కాలువ 46.6 కిలో మీటర్ల మేర ఉంటుందని, ప్రధాన కాలువ కింద ఉన్న 17 పిల్ల కాల్వలకు సంబంధించి పెండింగులో ఉన్న భూ సేకరణ పై గ్రామాల వారీగా ఇరిగేషన్, తహశీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ తో సుదీర్ఘంగా మంత్రి చర్చించారు.
– మల్లన్న సాగర్ ప్రధాన కాలువ కింద అప్పన్నపల్లి, పెద్డగుండవెళ్లి, హసన్ మీరాపూర్, చెల్లాపూర్, రాజక్కపేట, తిమ్మాపూర్, దుంపలపల్లి, దుబ్బాక, చీకోడ్, పోతారం, గంభీర్ పూర్ గ్రామాల్లో పిల్ల కాల్వల కోసం ఇప్పటివరకు చేపట్టిన, చేపట్టాల్సిన భూ సేకరణ అంశాలపై అధికారులతో మంత్రి చర్చించి, యుద్ధప్రాతిపదికన భూ సేకరణ చేయలని అధికారులకు ఆదేశించారు.