అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న తన ఉక్కు సంకల్పంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏ మాత్రం రాజీపడడం లేదు.
చారిత్రాత్మక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 2014 రాష్ట్ర విభజన లాంటి పరిస్థితి రాష్ట్రంలో మరోసారి రాకూడదని వైయస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం తెలిసిందే..
విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయపాలనా రాజధానిగా మారుస్తూ సిఆర్డిఏను రద్దు చేస్తూ సంబంధిత బిల్లులను గత ఏడాది శీతాకాల సమావేశాలలో అసెంబ్లీలో ఆమోదించడం తెలిసిందే! అయితే ఇదే బిల్లులను శాసనమండలికి పంపిన తరుణంలో మండలి ఛైర్మెన్ స్థానంలో వున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎం.ఏ.షరీఫ్ తనకున్న విచక్షణాధికారంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి, దొడ్డిదారిన చంద్రబాబు కుయుక్తులకు మద్దతు తెలిపాడు. ప్రజలు ఎన్నుకున్న సభ్యులతో కూడిన శాసనసభ ఆమోదించిన బిల్లులకు దొడ్డిదారిన వచ్చిన మండలి సభ్యులు అడ్డుకోవడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. శాసనమండలి అన్నది ప్రభుత్వ విధానాలలో భాగంగా వుండాలేగాని, ప్రతి బంధకం కాకూడదనే ఉద్దేశ్యంతో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేస్తూ, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్రం వద్ద ఇంకా ఆ బిల్లులపై ఆమోదముద్ర పడకపోవడంతో రాష్ట్రంలో ఇంకా శాసనమండలి కొనసాగుతోంది..
ఈ నెల 16, 17 తేదీలలో రెండురోజుల పాటు నిర్వహించిన బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం మరోసారి సిఆర్డిఏ రద్దు బిల్లు.. మూడు రాజధానుల బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎంతగా అడ్డుకోవాలని చూస్తున్నా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంపై ముందడుగే వేస్తున్నాడు. ఈమేరకు కార్యనిర్వాహక రాజధానిలో అవసరమైన భూసేకరణ, ఇతర వసతుల కొరకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. ఆరునూరైనా ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ వెనుకడుగేసే ప్రసక్తే లేదు… త్వరలోనే అమరావతి నుండి విశాఖకు పరిపాలనా రాజధానిని మార్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు..
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నాడు. ఇక్కడ అద్భుతమైన రాజధానిని నిర్మించాలంటూ పాతిక దేశాలకుపైగానే తిరిగి డిజైన్లకు, గ్రాఫిక్స్లకు వందల కోట్లు తగలేశాడు. రాజధాని పేరుతో దాదాపు 40వేల ఎకరాలు మంచి మాగాణి పొలాలను నాశనం చేయాలని చూశాడు. రాజధాని ముసుగులో సిఆర్డిఏ పేరుతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నడపాలని చూశాడు. కాని 2019 ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రస్తుత ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో మూడు రాజధానుల దిశగా కదులుతుండడంతో బాబు ‘కు’ల రాజధాని సౌధాలు కూలుతున్నాయి….