అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో మహావీర్, జితో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జితో కొవిడ్ కేర్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.
100 పడకల ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్సలు అందించాలని సెంటర్‌లోని వైద్యులకు, నర్సులకు సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడంలో జైనుల సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
తక్కువ ఖర్చులతో మంచి సంరక్షణను ఈ సంస్థ అందిస్తుందన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నందుకు వారి కోసం తక్కువ ఖర్చులతో ఈ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని హైదరాబాద్ చాప్టర్ జితో చైర్మన్ మనోజ్ దుగర్ అన్నారు. ఈ సెంటర్‌లో కరోనా రోగులకు 7 రోజులకు కేవలం 28 వేల నుంచి 35 వేల చార్జీ ఉంటుందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తామని చెప్పారు.
అత్యవసర వినియోగం కోసం ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందన్నారు. శాఖాహారం, అల్పాహారం, భోజనంతో పాటు ఎవరైనా జైన్ ఆహారం కావాలంటే అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి ,జితో సలహాదారులు నరేంద్ర సురానా, ఆశోక్ కొఠారి, సురేందర్ బాంటస్ తదితరులు పాల్గొన్నారు.