Home / ANDHRAPRADESH / టీడీపీ నేతకు సుప్రీం షాక్

టీడీపీ నేతకు సుప్రీం షాక్

డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది.

కందికుంట కేసు మంగళవారం జస్టిస్‌ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరితో పాటు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది.

వాదనలు విన్న న్యాయమూర్తులు.. కింది కోర్టులో శిక్ష పడిన వ్యక్తి.. తీర్పును సవాల్‌ చేస్తూ పైకోర్టుకు వెళ్లినప్పుడు ఆ కేసు విచారణలో ఉండగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇక నకిలీ డీడీలకు సంబంధించిన కేసు హైకోర్టులో పరిష్కారమయ్యే వరకు కందికుంట వెంకటప్రసాద్‌ సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయరని ఆయన తరఫు న్యాయవాది ఎస్‌.బసంత్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు.