Home / SLIDER / కొత్త రెవెన్యూ చట్టంపై శాసన మండలిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కొత్త రెవెన్యూ చట్టంపై శాసన మండలిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని.. కోవిడ్‌ ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యమైందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు.

మోదీ ప్రభుత్వం నష్టం చేసింది!

హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నప్పుడు సంప్రదాయాలు వేరు అని.. ఎన్టీఆర్‌ హయాంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారన్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూమి ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూమిగా వర్గీకరణ చేశారన్నారు. మోదీ ప్రభుత్వం సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించి అన్యాయం చేసిందన్నారు. తెలంగాణలోరని 7 మండలాలను ఏపీలో కలిపి మోదీ సర్కార్ రాష్ట్రానికి శాశ్వత నష్టం చేసిందన్నారు. అసలు ఇప్పుడు తెలంగాణలో భూస్వాములే లేరని.. ఎస్సీ ,ఎస్టీ, బీసీల చేతుల్లోనే 90శాతం పైగా భూములు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 25 ఎకరాల పైబడి ఉన్న రైతులు కేవలం 6600 మంది మాత్రమేనని సీఎం చెప్పుకొచ్చారు.
సామాన్యుల కోసమే..

‘భూమిశిస్తును ఎన్టీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసింది. టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా భూమిశిస్తు వసూలు చేయడం లేదు. కొత్త రెవెన్యూ చట్టం సామాన్యుల కోసమే. కొందరు చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రైతుబంధు పథకం భూస్వాముల కోసం కాదు. రాష్ట్రంలో 25 ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.11 శాతమే. వీఆర్వోల దుర్మార్గాల నుంచి విముక్తి కోసమే కొత్త రెవెన్యూ చట్టం. ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వాల్సిన అవసరం రాదు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌ పారదర్శకంగా పనిచేస్తుంది. ఎవరైనా, ఎప్పుడైనా ఓపెన్‌ చేసి చూసుకోవచ్చు. తహసీల్దార్లు కూడా ట్యాంపర్‌ చేయలేని విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఏడాదిలోపే సర్వే..

‘ఏడాదిలోపే సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం. జిల్లాకో ఏజన్సీతో భూమిని సర్వే చేయిస్తాం. భూసర్వేకు అత్యాధునిక టెక్నాలజీ వాడుతాం. ఇంతపెద్ద మార్పు జరిగేటప్పుడు అభ్యంతరాలు సహజమే. భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలి. కావాలని గొడవలు పెట్టుకుంటే సివిల్‌ కోర్టులోనే తేల్చుకోవాలి. కొత్త రెవెన్యూ చట్టంతో భూవివాదాలు తగ్గుతాయి. కౌలుదారులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతు తనకు నచ్చిన వ్యక్తికి భూమిని కౌలుకు ఇచ్చుకుంటాడు’ అని కొత్త రెవెన్యూ బిల్లుపై మండలిలో కేసీఆర్‌ పై వ్యాఖ్యలు చేశారు.