శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్‌లో ఆరేండ్లలో హైదరాబాద్ సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గెలుపుపై నిర్దేశంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కరెంట్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
వారంలో రెండురోజులు పవర్ హాలీడే ఉండేది. సూరారం, చెర్లపల్లి, జీడిమెట్ల మొదలైన పారిశ్రామికవాడలు.. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, జిరాక్స్ సెంటర్లు.. ఇలా కరెంట్ మీద ఆధారపడిన వేలు, లక్షల కుటుంబాలు మూడు పూటలా తిండికి నోచుకోక, ఉపాధి ప్రశ్నార్థకమై జీవనం సాగించే పరిస్థితి ఉండేది.
విద్యార్థులకైతే పరీక్షా సమయల్లో కరెంట్ కోసం క్షణక్షణం పరీక్షే ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఉన్నదా? 24 గంటలు నాణ్యమైన, నిరంతరాయమైన కరెంట్ సరఫరా చేస్తూ పారిశ్రామిక పురోగతికి తోడ్పాటు అందించిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది” అని అన్నారు.