ఎవరెస్ట్ అంత ఎత్తు మాస్ పాపులారిటీకి ఆయనే నిలువెత్తు నిదర్శనం. దక్షిణాదిలో సినీ అభిమానులు ఆయన పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ ప్రభంజనం, ఆ పెనుకెరటం పేరే.. సూపర్ స్టార్.. తలైవా…రజనీకాంత్. డిసెంబరు 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా..
భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఊహించని అపూర్వస్థానాన్ని కైవశం చేసుకున్న రజనీకాంత్ జీవితం పూలపాన్పులా ప్రారంభం కాలేదు. ఎన్నో ఒడిదుడుకులు… మరెన్నో ఎత్తుపల్లాలు…అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసమే రజనీని చేయి పట్టుకుని నడిపించింది. తిరగని సినిమా ఆఫీసు లేదు. మొక్కని దర్శకుడు లేడు. నిర్మాతల చుట్టూ అంగ ప్రదిక్షణలు చేయడంలోనే ప్రతీరోజూ గడిచేది. పట్టుదల, కృషి ఉంటే మనిషి అధిరోహించలేని శిఖరాలు ఉండనే ఉండవు అనే జీవితసత్యానికి రజనీకాంతే సజీవనిదర్శనం. అందుకే రజనీకాంత్ కోటానుకోట్లమందికి ఆరాధ్యదైవమయ్యారు. స్ఫూర్తిదాయకమయ్యారు. 1976లో మొదలైన రజనీకాంత్ సినీప్రయాణం మెల్లమెల్లగా సాగుతూ, క్రమక్రమంగా ఊపందుకుంది. అటు కమల్ హాసన్ అన్నీ విచిత్రమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే, రజనీకాంత్ మాత్రం మాస్ క్యారెక్టర్స్ ద్వారా మాస్ ఆడియన్స్ గుండెల్లోకి, స్లమ్స్ లోని పూరిగుడిసెల్లోకి చొచ్చుకుపోయారు. రజనీకాంత్ సినిమా వస్తోందంటే చాలు మాస్ పిచ్చెక్కిపోయిన వాతావరణం తమిళనాట మొత్తం నెలకొంది. ఆ డైలాగులు, ఆ హేండ్ కటింగులు, ఆ హెయిర్ స్టయిల్ చూసి అభిమానులకు పూనకం వచ్చినట్టయ్యేది.
1980ల నాటికి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ అగ్రశ్రేణి నటుడిగా ప్రాచుర్యం పొందితే, 1980లో వచ్చిన అమితాబ్ నటించిన డాన్ రీమేక్ బిల్లా చిత్రం రజనీని ఫుల్ లెంత్ యాక్షన్ హీరోగా బాక్పాఫీసు సాక్షిగా నిరూపించి, సరికొత్తచరిత్రకు శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలు బిల్లా చిత్రమే రజనీ కెరీర్లో అతిపెద్ద బాక్సాఫీసు హిట్ గా రికార్డు నెలకొల్పింది. కానీ 1990 తర్వాత మాత్రం ఇంకా ఆ దశని రజనీకాంత్ ప్రపంచంగానే పిలవాలి. అది ఓ కొత్త అవతారం…రజనీకాంత్ విశ్వరూపం…ప్రతీ చిత్రం ఓ పెద్ద సంచలనం, వసూళ్ళ పెనుతుఫాను. పలు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు.. అనువాదాలతో తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు రజనీకాంత్. ఇక.. హిందీలో సైతం ‘హమ్’, ‘ఖూన్ కా కర్జ్’, ‘ఫూల్ బనే అంగారే’ లాంటివి బాలీవుడ్లో రజనీకాంత్ ప్రాబల్యాన్ని ఎంతగానో చాటిచెప్పాయి. దర్శకరచయితలు రజనీకాంత్ ని సరికొత్త కమర్షియల్ కోణంలో తెరమీద ఆవిష్కరించడానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టిన దశ అది. అభిమానులు సముద్రంలా పొంగుతుంటే, వారి అంచనాలను అందుకోవడానికి యావత్తు తమిళ సినీపరిశ్రమ రాత్రీపగలు తేడా లేకుండా వినూత్నకథల గాలింపు ముమ్మరమైంది.
2010 సంవత్సరం మొత్తం భారతీయ చిత్రపరిశ్రమకే ఒక మేలుకొలుపు. ఊహించలేని కుదుపు. రజనీకాంత్‌ని దర్శకుడు శంకర్ ఎవ్వరూ అందుకోలేని సమున్నత శిఖరాలపైన నిలబెట్టాలనే శ్రద్ధతో తీసిన రోబో భారతీయ ఉపఖండాన్ని బోల్తా కొట్టించింది. అత్యంత ఖరీదైన చిత్రనిర్మాణవిలువలతో తెరకెక్కిన రోబో, అత్యధికంగా భారీ వసూళ్ళను రాబట్టిన తొలిచిత్రంగా రికార్డులను బద్దలు కొట్టింది. రజనీకాంత్ ఇంక నటించడానికి మరే పాత్రా మిగల్లేదు అన్నరీతిలో రోబో రజనీకాంత్ రాజశాసనంగా మారింది.. రోబో చిత్రం చూసిన చిరంజీవి కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పట్టలేని ఆనందంతో రజనీకాంత్‌ని అభినందనల్లో ముంచెత్తారు. ఇదంతా సరే, రజనీకాంత్ ఇటీవలే ఓ కొత్తబాంబు పేల్చారు. మళ్ళీ తనదైన పంధాలో మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. అదే రాజకీయరంగ ప్రవేశం. ఆయన నోటివెంట వచ్చిన మాటలు.. రాజకీయరంగంలో పెను ప్రకంపనలను రేపాయి. అందరూ తుళ్ళిపడ్డారు. కొందరు వణికిపోయారు. రజనీకాంత్ కి ఉన్న ప్రాబల్యం అటువంటిది. ఆయన ఇమేజ్ ఆషామాషీ కాదు. రజనీ రాజకీయ ప్రకటనతో అభిమానులు కేరింతలు కొడుతుంటే, ప్రత్యర్ధులకు మాత్రం ముచ్చెమటలు పోస్తున్నాయి. నా దారి రహదారి అనే రజనీకాంత్ డైలాగ్ ఇప్పుడు తమిళనాడులో ఊరూరా, వాడవాడలా మారుమ్రోగుతోంది. అయినా రజనీకాంత్ రాజకీయభవితవ్యం ఏమిటి? ఎటువైపు? ఇవన్నీ ప్రస్తుతానికైతే సమాధానాలు దొరకని ప్రశ్నలే. అన్నీ ఊహాగానాలే. ఆయన ఏ పోటీలో ఉన్నా.. విజయం వరించాలని మనమూ ఆశిస్తూ.. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని..మనమూ కోరుకుందాం.