తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ముద్ర ఎవరికి ఉంది అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు తమన్. ఈయన పాటలు ఏది విడుదలైనా కూడా వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతుంటారు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం మీమ్స్ తమన్ కోసం కంటే ఎక్కువగా మరెవరికీ వాడుండరు కూడా. అంతగా ఈయన్ని ఆడుకుంటారు మీమర్స్. ఎలాంటి పాట వచ్చినా కూడా ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ చేసుంటాడంటూ ఈయనతోనే ఆడుకుంటారు. పెద్ద హిట్ అయిన పాటలను కూడా కాపీ కొట్టాడనే విమర్శలు అందుకున్నాడు ఈయన. సామజవరగమనా పాటను కూడా లోకల్ తెలంగాణ సాంగ్ నుంచి కాపీ కొట్టాడనే విమర్శలు వచ్చాయి. దాంతో పాటు రాములో రాములా కూడా అంతే. ప్రతీ పాటను కూడా ఎక్కడో ఓ చోటు నుంచి ఎత్తుకుని వస్తుంటాడు.
తమన్ పెద్ద కాపీ క్యాట్ అంటూ సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతూనే ఉంటుంది. దీనిపై తమన్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు. తాను కాపీ కొడుతున్నానని తెలిస్తే.. కాపీ ట్యూన్స్ ప్లే చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అంటూ తమన్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి కాపీ క్యాట్ అనే ముద్రపై స్పందించాడు ఈయన. ‘వాళ్లకి అంత దమ్ముంటే. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్ చేసి చూపించమనండి’ అంటూ మండిపడ్డాడు తమన్. ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఇక్కడ ఎవడూ వినేవాడు లేడు అంటూ ఫైర్ అయ్యాడు. ఓ పాట విడుదల చేసేముందు అందరూ వింటారు.. ఆడియో కంపెనీలు, లిరిక్ రైటర్లు, తనతో పనిచేసే వాళ్లు అంతా వింటారు.. మరి వాళ్లందరికీ నచ్చే పాట కాపీ అయితే వాళ్లకు తెలివి లేదంటారా అంటూ ప్రశ్నిస్తున్నాడు.
ఒకవేళ నిజంగా కాపీ కొడితే దర్శక నిర్మాతలకి తన ముఖం ఎలా చూపిస్తా అంటూ ఫైర్ అవుతున్నాడు. అంతంత రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు నువ్వెందుకు కాపీ కొట్టావని అడుగుతారు కదా అంటున్నాడు. అయినా కూడా పనిలేని కొందరు చేసే కామెంట్స్ పట్టించుకుంటూ కూర్చుంటే తన పని ఆగిపోతుంది కదా అంటున్నాడు ఈయన. ‘బిజినెస్‌మెన్’లో ‘పిల్లా చావ్’ పాటతో తనకు వచ్చినంత చెడ్డ పేరు ఇంకెవరికీ వచ్చుండదు.. ఆ విమర్శల్ని పట్టించుకొని ఉంటే నేను అక్కడే ఆగిపోవాలి కదా అని ప్రశ్నిస్తున్నాడు. బిజినెస్ మేన్ తర్వాత 100 సినిమాలకు పైగా సంగీతం అందించాడు ఈయన. తమన్ అంటున్న మాటలకు కొందరు ఆయన అభిమానులు అండగా నిలుస్తున్నారు.