Home / EDITORIAL / ప్రగతి ఫలాల తెలంగాణ

ప్రగతి ఫలాల తెలంగాణ

వలసపాలన నుంచి విముక్తి చెంది తెలంగాణ ఆత్మనెరిగిన కేసీఆర్‌ నాయకత్వంలో 2014 జూన్‌ 2 నుంచి స్వయంపాలన మొదలైంది. తెలంగాణ అవసరాలు, కష్టాలు, సుఖాలు, నైసర్గిక స్వరూపం, వనరులు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఎరిగిన ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఓ పథకం ప్రకారం పనులు చేస్తున్నారు. తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్‌ ఏ ఎజెండాతో పదమూడేండ్లు నిర్విరామ పోరాటం చేసిందో ఆ ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం నిర్విరామ కృషి కొనసాగుతున్నది.

దేశానికి వెన్నెముక లాంటి వాడైన రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని పండుగగా మార్చడానికి కేసీఆర్‌ అనేక పథకాలు అమలుపరుస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ రోజు తెలంగాణ దిక్కు చూస్తున్నయంటే, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నయంటే అందుకు కారణం లభిస్తున్న వసతులే. ఈ ఐదారేండ్లలో జరిగిన అభివృద్ధి పనుల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ప్రగతి తీరును, పథకాలను పక్షపాత వైఖరితో కాకుండా వాస్తవికంగా పరిశీలించడం మంచిది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం వివిధ వృత్తి పనివారలకు వారి ఆదాయమార్గాలను పెంచడానికి గొర్లు, బర్లు, మేకలు, చేపలు, మరమగ్గాలు, సెలూన్లు ఇతరాలు ఇవ్వాలనుకుంటే ఆ పనిని కులాలను స్థిరీకరించడానికేనని, ఆయా వర్గాలను చదువులకు దూరం చేయడానికేనని విమర్శించడం సముచితమవుతుందా! రైతుబంధు పథ కం రైతు జీవితంలో ఎంత వెలుగు నింపిందో, దేశానికే ఎలా ఆదర్శప్రాయమైందో తెలియంది కాదు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రగతి ఫలాలు ప్రతి గడపనూ తాకుతున్నాయన్నది వాస్తవం.

కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాల వల్ల రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య తీరడం మాత్రమే కాకుండా భూగర్భజలాలూ పెరుగుతున్నాయి. 24 గంటలు విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. మోటర్లు కాలడం లాంటి సమస్యలన్నీ దూరమయ్యాయి. నీరు, కరంటుతోపాటు పెట్టుబడి సాయం, రుణమాఫీ, నాణ్యమైన విత్తనాల సరఫరా, పంటల మార్పిడి, ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతుపంటను ప్రభుత్వం కొనడం, అనేక విధాలుగా రైతులనాదుకోవడం లాంటి చర్యల వల్ల రైతు సమస్యలకు చాలావరకు పరిష్కారాలు లభించాయి. గ్రామాలను రైతులు హృదయానికి హత్తుకొనే స్థితి వచ్చింది. వలసలు కొంతవరకైనా ఆగిపోయాయి. గోల్కొండ కోటలో జెండా ఎగురవేయడం ద్వారా మన పూర్వవైభవాన్ని మననం చేసుకున్నట్టయింది. యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంతాన్ని తిరుపతి లాంటి పుణ్యక్షేత్ర స్థలంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. ఇది తెలంగాణలోనే అతి గొప్ప యాత్రాస్థలంగా ప్రసిద్ధి చెందనుంది. అందమైన తెలంగాణ ప్రాంతాలన్నీ పర్యాటక కేంద్రాలుగా మారిపోతున్నాయి. కుంతాల వాటర్‌ ఫాల్స్‌ ప్రాంతాన్ని హిల్‌స్టేషన్‌గా, పోతన, పాల్కుర్కి సోమనాథుడు పుట్టిన బమ్మెర, పాలకుర్తి ప్రాంతాన్ని ప్రభుత్వం అద్భుతమైన యాత్రాస్థలంగా తీర్చిదిద్దాలనుకుంటున్నది.

ఇదివరలో బతుకమ్మ లాంటి పండుగలను జరుపుకోవడాన్ని పట్టణాల్లో, కొన్నివర్గాల్లో తక్కువతనంగా భావించే వాతావరణముండేది. సంక్రాంతి పండుగకిచ్చిన ప్రాధాన్యం బతుకమ్మకు ఉండేది కాదు. ఇప్పుడు బతుకమ్మ అందరూ గౌరవించే సాంస్కృతిక వారసత్వ పండుగగా మారింది. పాలపిట్టకు ప్రత్యేక గుర్తింపు లభించింది. తెలంగాణ సర్కారు ప్రోత్సాహం వల్ల ఇప్పుడు రాష్ట్రమంతటనే కాదు, ప్రకృతి ఆరాధనే ధ్వేయంగా ఉన్న ఈ పూల పండుగకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. స్వాతంత్య్రానికి ముందు తెలంగాణ భూస్వాములు కోస్తాంధ్ర భూస్వాముల కంటే ధనికులుగా ఉండేవారు. కానీ వలసపాలనలో కోస్తాంధ్ర ప్రాంతం వారే పెట్టుబడిదారులుగా ఎదిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ స్థితికి తెరపడి తెలంగాణవాళ్లూ పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నారు. తెలంగాణ నుంచి సినిమాలు తీయడం, హీరోలుగా ఎదిగే క్రమమూ బలపడుతున్నది. తెలంగాణ జీవభాష ఇప్పుడు టీవీల్లో, సినిమాలలో, ప్రోగ్రాముల్లో గౌరవమందుకుంటున్నది. తెలంగాణ భాషకు, రచయితలకు, కళాకారులకు అవకాశాలు మెరుగవుతున్నాయి. వీటన్నిటికి కారణం తెలంగాణ అవసరాలు, అన్నిరకాల గుట్టుమట్లు తెలిసిన ప్రభుత్వం అధికారంలో ఉండటమే.

ఉద్యోగ, ఉపాధి కల్పనలోనూ తేడా కనిపిస్తున్నది. ఐటీ కేంద్రంగా మారడం వల్ల వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా, ఇతర శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చిన ప్రభుత్వం.. నిజాం కాలంలోలా ధనిక రాష్ట్రంగా, దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నది. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఐటీ, ఫార్మా కంపెనీలు నెలకొల్పుతూ తెలంగాణ రాష్ర్టాన్ని ధనిక రాష్ట్రంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పష్టమైన విజన్‌, మొక్కవోని పట్టుదల, చాణక్యనీతి, రాజకీయ వ్యూహాలు ఉన్న కేసీఆర్‌ ఈ ఆరున్నరేండ్లలో పాలనకు, రాజకీయాలకు, ఇతరాలకు తీసుకొచ్చిన గౌరవం, తెలంగాణతనం, ప్రాంతీయ ముద్ర ఆయనను సమున్నతంగా నిలబెడుతున్నాయి.

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల సమస్యలన్నీ ఈ స్వల్పకాలంలోనే పరిష్కారం కాకపోవచ్చు. కానీ అన్ని సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సాధన ఫలాలను సామాన్యులకు అందేలా చేయడంలోను, దేశంలో తెలంగాణను సమున్నతంగా నిలబెట్టడంలోనూ కేసీఆర్‌ అచంచల దీక్షతో ముందుకు పోతున్నారు.

-డాక్టర్‌ కాలువ మల్లయ్య

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat