కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని హెచ్చరించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేకుంటే తమ పార్టీ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తగిన కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపైన కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తారన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
సమాచార హక్కు పిటీషన్‌కు సమాధానం ఇస్తూ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి కార్యాలయం పేర్కొంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిసారి రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉందన్నారు. తాజాగా రాష్ట్ర పునర్ విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి మరోసారి తెలంగాణ పట్ల తన వ్యతిరేక వైఖరిని బీజేపీ చాటుకుందన్నారు.
ఇప్పటికే ఐటీఐఆర్.. తాజాగా కాజీపేట రైల్వే ప్రాజెక్టు
ఇప్పటికే హైదరాబాద్ నగర ఐటీ అభివృద్ధిని అడ్డుకునేలా ఐటీఐఆర్ ప్రాజెక్టుని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని స్పష్టం చేయడం వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్టయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా విస్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని, పలుమార్లు లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తాము చేస్తూనే ఉన్నామన్నారు. ఇందులో భాగంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని ప్రత్యేక శ్రద్ధతో మరో ప్రభుత్వశాఖ నుంచి సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణకు బీజేపీ మరోమారు అన్యాయం..
తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన ప్రాజెక్టుల విషయంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నా, కేంద్రంలోని బీజేపీ నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. తెలంగాణకు రిక్తహస్తం చూపడం బీజేపీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న 8 రైల్వే లైన్లు, సర్వే దశలో ఉన్న 3 లైన్ లు, 4 నూతన రైల్వే లైన్ల ప్రతిపాదనలు, రైల్వే కాజీపేట వ్యోగన్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్, రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు వంటి డిమాండ్లకు సైతం కేంద్రం నుండి కనీస స్పందన లేదన్నారు. ప్రతిసారి బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నానే దిక్కవుతోందన్నారు. తాజాగా ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రంలోని రైల్వేలైన్ లకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైల్వేలైన్ లకు సంబంధించి కూడా తెలంగాణకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. హైదరాబాద్ వంటి మహానగరానికి కూడా ఈ బుల్లెట్/స్పీడ్ ట్రైన్లు కేటాయించకపోవడం ఈ వివక్షకు తార్కాణం అన్నారు.
భవిష్యత్ తరాలకు బీజేపీ ద్రోహం..
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తూ భవిష్యత్ తరాలకు బీజేపీ ద్రోహం చేస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. భారతదేశ రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి రైల్వే వ్యవస్థను సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కుటిల యత్నాలు చేస్తుందన్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత రద్దీ కలిగిన 12 క్లస్టర్ లను గుర్తించి 109 ప్రధాన రైలు మార్గాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, ఈ ప్రైవేటీకరణ నిర్ణయం ద్వారా రైల్వేలకు సుమారు రూ. 63 వేల కోట్ల వార్షిక ఆదాయం కోల్పోయే అవకాశం ఉందన్నారు.