యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మకంగా జరుగుతున్నదని, ఈ నిర్మాణం చేపట్టిన సీఎం కెసిఆర్, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కరోనా కష్ట కాలంలోనూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అద్దంపట్టేలా ఉందని అన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చిరాయువుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికేదైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట శ్రీ యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం చేయించారు. తీర్థ, ప్రసాదాలు, ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి వస్త్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మరికొద్ది రోజుల్లోనే యాదాద్రి పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయని, సీఎం కెసిఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ ఆలయ విశిష్టతను ఇనుమడింప చేసేలా, పనులు శర వేగంగా జరుగుతున్నాయన్నారు.
మరోవైపు బడ్జెట్ సమావేశాలు అద్భుతంగా సాగుతున్నాయని, బడ్జెట్ లో కరోనా కష్టాలను అదిగమించి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ విజయం సాధించిందని, వచ్చే నాగార్జున సాగర్ ఎన్నికల్లోనూ విజయ పతాకాని ఎగురవేస్తామన్నారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి తమ ఇలవేల్పు అని, అందుకే తాను తరచూ దేవాలయాన్ని సందర్శిస్తామన్నారు. సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చల్లగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించినట్లు మంత్రి వివరించారు. మంత్రి వెంట ఆలయ అధికారులు, అర్చకులు ఉన్నారు.